UN: లక్షమంది నిరాశ్రయులైపోతారు.. కూల్చొద్దు!

హరియాణాలోని ఖోరి గ్రామంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ భారత అధికారులకు విజ్ఞప్తి చేసింది.

Published : 19 Jul 2021 01:07 IST

ఖోరి గ్రామంపై భారత అధికారులకు ఐరాస విజ్ఞప్తి

ఛండీగఢ్‌: హరియాణాలోని ఖోరి గ్రామంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ భారత అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఖోరి గ్రామంలో నిర్మాణాలను కూల్చివేసే నిర్ణయాన్ని వెంటనే పునః సమీక్షించుకోవడంతో పాటు, వారి పునరావాసంపై మరోసారి పరిశీలించాలని కోరింది. సకాలంలో వారికి పరిహారం అందించడంతో పాటు పరిష్కారం లభించే వరకు ఎవ్వరినీ బలవంతంగా ఖాళీ చేయించకూడదని పేర్కొంది. తద్వారా లక్ష మంది ప్రజలు నివాసం లేనివారు కాకుండా జాగ్రత్తపడవచ్చని అభిప్రాయపడింది. ముఖ్యంగా వారిలో దాదాపు 20వేల మంది చిన్నారులు కూడా ఉన్నారని.. తాజా చర్యలతో వారంతా నిరాశ్రయులు అవుతారని ఐరాస విభాగం ఆందోళన వ్యకం చేసింది.

భారత్‌ అసంతృప్తి.. వెనక్కి తగ్గిన యూఎన్‌

ఓవైపు కరోనా మహమ్మారి, మరోవైపు వర్షాకాల సమయంలో కూల్చివేతలు చేపట్టడంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషన్‌ (OHCHR) ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై భారత్‌ స్పందించేలోపే వీటిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఐరాస మానవ హక్కుల విభాగం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిణామంపై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై తాము సమాధానం ఇచ్చేలోపే మీడియా ప్రకటన విడుదల చేయడం దురదృష్టకరమని పేర్కొంది. అయితే, ఐరాస మానవ హక్కుల విభాగం తొందరపాటు చర్య దురదృష్టకరమని భారత్‌లోని ఐరాస శాశ్వత కమిషన్‌ స్పష్టం చేసింది. భారత సుప్రీంకోర్టుపై ప్రత్యేక ప్రతినిధి చేసిన అగౌరవ వ్యాఖ్యలపైనా ఆందోళన వ్యక్తంచేసిన యూఎన్‌, ఇలాంటి చర్యలు సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది. దేశ ప్రజల మానవ హక్కుల బాధ్యతల గురించి భారత్‌కు పూర్తిగా తెలుసని.. వాటి అమలుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని మరో ప్రకటనలో వెల్లడించింది.

హరియాణాలోని ఖోరి గ్రామంలో అటవీ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను జూన్‌ 7న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నిర్మాణాలు అటవీ భూమిలో చేపట్టినందున ఎటువంటి మినహాయింపూ ఇచ్చేదిలేదని స్పష్టం చేసింది. వాటి తొలగింపునకు ఆరువారాల గడువు ఇచ్చిన కోర్టు.. ఈ ప్రక్రియను జులై 19 నాటికి పూర్తిచేయాలని పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిర్మాణాలను తొలగించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఆ గ్రామంలో 172 ఎకరాల అటవీ భూమిలో దాదాపు 5300 అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు అధికారులు గుర్తించారు. వాటిలో ఇప్పటికే 2 వేల ఇళ్లను నేలమట్టం చేసినట్లు సమాచారం. గడిచిన మూడు రోజుల్లోనే 800 ఇళ్లను అధికారులు కూల్చివేశారు. అయితే, చట్టప్రకారం వారందరికీ పునరావాసం కల్పిస్తున్నామని ఫరీదాబాద్‌ మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని