
Omicron: దేశంలో 70దాటిన ఒమిక్రాన్ కేసులు.. హోంశాఖ సమీక్ష!
దిల్లీ: దేశంలో ఆందోళనకర వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పది రాష్ట్రాలకు విస్తరించింది. గురువారం నాటికి దేశవ్యాప్తంగా 70కి పైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క మహారాష్ట్రలోనే 32 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. రాజస్థాన్లో 17 మందిలో ఈ వేరియంట్ బయటపడింది. దిల్లీలో నేడు కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్-19 పరిస్థితులపై కేంద్ర హాంశాఖ సమీక్ష నిర్వహించింది. ముఖ్యంగా కొవిడ్ కట్టడికి కేంద్ర పాలిత ప్రాంతాలు సిద్ధంగా ఉండాలని సూచించింది.
విస్తృత వేగంతో వ్యాపించే ప్రమాదమున్నట్లు భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే చాలా రాష్ట్రాలకు విస్తరించింది. రానున్న రోజుల్లోనే ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్-19 పరిస్థితులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష నిర్వహించారు. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉండాలని అన్ని కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కూడా పాల్గొన్నారు.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ నిత్యం దాదాపు 7వేల కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 7974 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 343 మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.