స్పష్టంగా చెప్పాం.. అయినా తెరాస గందరగోళం సృష్టిస్తోంది: పీయూష్‌ గోయల్‌

తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం (ఎంవోయూ) ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార,

Updated : 03 Dec 2021 16:56 IST

దిల్లీ: తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం (ఎంవోయూ) ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. బాయిల్డ్‌ రైస్‌ ఎంత కొంటారో స్పష్టం చేయాలంటూ తెరాస సభ్యుడు కె.కేశవరావు (కేకే) రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్‌తోనూ మాట్లాడానని.. వానాకాలం పంట పూర్తిగా కొంటామని చెప్పారు. దేశంలో ప్రతి ఏటా ధాన్యం సేకరణను పెంచుతున్నామని.. తెలంగాణ నుంచి కూడా బాగా పెంచామని వివరించారు. 2018-19లో తెలంగాణలో 51.9 లక్షల టన్నులు, 2019-20లో 74.5లక్షల టన్నులు, 2020-21లో 94.5లక్షల టన్నుల ధాన్యం సేకరించామన్నారు.

ఎంవోయూకు కట్టుబడి ఉండాలి

‘‘ఖరీఫ్‌ సీజన్‌లో 50లక్షల టన్నులు ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. 32.66 లక్షల టన్నులే ఇచ్చింది. ఎంవోయూకు కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా. తెలంగాణ అంచనాలకు, వాస్తవాలకు చాలా తేడా ఉంటోంది. ధాన్యం సేకరణ విషయంలో కర్ణాటక నమూనా చాలా బావుంది. దాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తే బావుంటుంది. తెలంగాణ నుంచి 24లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కొనేందుకు ఒప్పందం జరిగింది. దాన్ని 44లక్షల టన్నులకు పెంచాం. ఇప్పటి వరకు 27లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ వచ్చింది.. ఇంకా 17లక్షల  టన్నులు పెండింగ్‌ ఉంది. పెండింగ్‌ ధాన్యం పంపకుండా భవిష్యత్‌ గురించి తెరాస ప్రశ్నిస్తోంది.

సాధ్యమైనంత వరకూ సహకరిస్తున్నాం

భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని ముందుగానే చెప్పాం. ఈ విషయాన్ని ఎంవోయూలో స్పష్టంగా పేర్కొన్నాం. అయినా భవిష్యత్‌ గురించి ప్రశ్నిస్తూ తెరాస గందరగోళం సృష్టిస్తోంది. ఇకపై బాయిల్డ్‌ రైస్‌ పంపబోమని అక్టోబర్‌ 4న తెలంగాణ లేఖ రాసింది. ఇప్పుడు మాత్రం బాయిల్డ్‌ రైస్‌ కొనాలని పదేపదే గొడవ చేస్తున్నారు. ధాన్యం విషయాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్లేదు. భౌతిక తనిఖీల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు తెలంగాణకు వెళ్లారు. ఆ రాష్ట్రం ధాన్యం లెక్కలను సరిగా నిర్వహించడం లేదు. ధాన్యం సేకరణ కేంద్రానికి కొత్త కాదు. ఏళ్ల తరబడి ఓ పద్ధతి ప్రకారం జరుగుతన్న ప్రక్రియే. కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత వరకూ తెలంగాణకు సహకరిస్తోంది’’ అని పీయూష్‌ గోయల్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని