Marathon: ఓ వైపు కొవిడ్‌ కలవరం.. వేలమంది అమ్మాయిలతో మారథాన్‌!

అధికారులు అనుమతి ఇవ్వనప్పటికీ కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్‌ పార్టీ భారీ మారథాన్‌ను నిర్వహించడం చర్చనీయాంశమయ్యింది.

Published : 26 Dec 2021 19:48 IST

భారీ ప్రచారాలపై భాజపా, కాంగ్రెస్‌ ప్రతివిమర్శలు

లఖ్‌నవూ: దేశవ్యాప్తంగా కొత్తవేరియంట్‌ విస్తరిస్తోన్న వేళ కేంద్రప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కొవిడ్‌ కట్టడి చర్యలు ముమ్మరం చేయాలని సూచించింది. దీంతో ఆయా రాష్ట్రాలు ఆంక్షలు విధించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇదే సమయంలో అధికారులు అనుమతి ఇవ్వనప్పటికీ కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్‌ పార్టీ భారీ మారథాన్‌ను నిర్వహించడం చర్చనీయాంశమయ్యింది. ఓవైపు కొవిడ్‌ విజృంభణ వేళ భారీ ప్రచార కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తారంటూ భాజపాపై విమర్శలు గుప్పిస్తోన్న కాంగ్రెస్‌ పార్టీ... అధికారుల అనుమతి లేకున్నా మారథాన్‌ను చేపట్టడం విమర్శలకు దారితీసింది.

కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ పిలుపు మేరకు ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలో ‘లడ్‌కీ హూ.. లడ్‌ సక్‌తీ హూ (నేను బాలికను.. అయినా పోరాడగలను..)’ అనే పేరుతో మారథాన్‌ను నిర్వహించారు. అయితే, ఇందుకోసం అధికారులను అనుమతి కోరగా.. కొవిడ్‌ విజృంభణ కారణంగా మారథాన్‌ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. దీనిపై స్పందించిన ప్రియాంకా గాంధీ.. యోగీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘మహిళా వ్యతిరేక ప్రభుత్వం కాబట్టే అమ్మాయిల మారథాన్‌కు అనుమతించలేదు. ఇటువంటి వాటిని అమ్మాయిలు సహించరు. వారి హక్కుల కోసం పోరాటం చేస్తామనేదే ఈ మారథాన్‌ సందేశం’ అంటూ ఓ వీడియో జత చేశారు. విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీ వంటి భారీ కార్యక్రలు చేపట్టే ప్రభుత్వం.. అమ్మాయిల మారథాన్‌ను ఎందుకు నిరాకరిస్తారని ప్రశ్నించారు. ఇలా కొవిడ్‌ విజృంభణ వేళ రాజకీయ పార్టీలు భారీ కార్యక్రమాలు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది.

ఇదిలాఉంటే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మహిళలపై దాడులను కట్టడి చేయడం, రాష్ట్రం అభివృద్ధిలో విఫలమయ్యారని యోగీ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వీటిని దీటుగా ఎదుర్కొంటున్న భాజపా నేతలు.. ఎస్‌పీ హయాంలోనే రాష్ట్రంలో రౌడీయిడం రాజ్యమేలిందని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తరాలుగా ఒకే కుటుంబం చేతిలో ఓ పార్టీ ఉందని కాంగ్రెస్‌ పార్టీపైనా విరుచుకుపడుతున్నారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని