
Omicron: నిబంధనలు పాటిస్తేనే ఒమిక్రాన్‌కు అడ్డుకట్ట: WHO
జెనీవా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ముఖ్యంగా ఆగ్నేయాసియాలోని ఏడు దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు చేసింది. కొవిడ్ నిబంధనలు, మాస్కు ధరించడం, భౌతికదూరం పాటిచడం వంటి చర్యలతోనే దీని వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఈశాన్య ఆసియా డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ వెల్లడించారు. వైరస్ కారణంగా రిస్క్ ఎక్కువగా ఉన్నవారిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
‘డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరమైనది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. అందుకే ప్రపంచ దేశాల్లో ఈ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌పై ఇంకా పూర్తి సమాచారం లేదు. రానున్న రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడవుతాయి. రీఇన్‌ఫెక్షన్‌ను పెంచే ప్రమాదం ఉందని దక్షిణాప్రికా పేర్కొంటోంది. కాబట్టి ఈ వేరియంట్‌ను తక్కువ అంచనా వేయొద్దు. వ్యక్తిగత సంరక్షణతోపాటు ఒకరినొకరు సంరక్షించుకోవాలి. టీకాలులు తప్పక తీసుకోవాలి. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలి’ అని ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు.
అన్నివిభాగాల్లో వైద్యంతోపాటు ఐసీయూ పడకల సామర్థ్యం, ఆక్సిజన్ సరఫరా తదితర విభాగాలను ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకోవాలని పూనమ్ సూచించారు. మహమ్మారిని అంతమొందించాలంటే వ్యాక్సినేషన్ ఎంతో ముఖ్యమైన అంశమన్నారు. అయితే కేవలం టీకా కార్యక్రమంతోనే కాకుండా ప్రజారోగ్యం, మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలు పాటిస్తే.. కొవిడ్ వ్యాప్తితో పాటు మరణాలు రేటును కూడా తగ్గించవచ్చని సూచించారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ దాదాపు 70 దేశాలకుపైగా వ్యాప్తిచెందినట్లు ఇటీవల డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. పలు దేశాల్లో ప్రతిరోజు వేలల్లో కేసులు బయటపడుతున్నాయి.