Afghanistan: ఐఎస్‌-కె స్థావరాలపై అమెరికా డ్రోన్‌ దాడులు!

అఫ్గానిస్థాన్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇస్లామిక్‌ శిబిరాలనే లక్ష్యంగా చేసుకొని ఈ దాడలు చేసిన నేపథ్యంలో కాబూల్‌ విమానాశ్రయాన్ని ఖాళీ చేయాలని పౌరులను అగ్రరాజ్యం హెచ్చరించింది. ఇటీవల

Updated : 28 Aug 2021 19:10 IST


కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో ఉగ్రఘాతుకానికి పాల్పడ్డ ఐసిస్‌ మూకలపై ప్రతీకారం తీర్చుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ దిశగా చర్యలు చేపట్టారు. అఫ్గాన్‌లోని నంగర్‌హార్‌ ప్రావిన్సులో ఉన్న ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై అమెరికా శనివారం ఉదయం డ్రోన్‌ దాడులు చేపట్టింది. ఈ దాడిలో గురువారం నాటి దాడుల సూత్రధారి మరణించినట్లు తెలుస్తోంది. తాము జరిపిన ఆపరేషన్‌లో ఒకరు మరణించినట్లు సెంట్రల్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి నేవీ కెప్టెన్‌ విలియం అర్బన్‌ వెల్లడించారు.

తాలిబన్‌ అధీనంలోకి వెళ్లిన అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా పౌరులు సహా ఇతరుల తరలింపు కార్యక్రమం తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, ఉగ్రమూకలు మరోసారి దాడికి పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో బైడెన్ డ్రోన్ దాడులకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ కూడా వెంటనే ఆమోదించడంతో ప్రణాళికలు చకాచకా ముందుకు సాగినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాబుల్‌ దాడులకు అమెరికా స్పందించిన వేగం చూస్తుంటే.. వారు ఐసిస్‌ కదలికలను ఎంత నిశితంగా పరిశీలిస్తున్నారో అర్థమవుతోంది!

గురువారం కాబుల్‌ విమానాశ్రయం వెలువల జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులతో పాటు సుమారు 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు పాల్పడింది తామే అని ఇస్లామిక్‌ స్టేట్‌-ఖొరాసన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వేటాడి, మట్టుబెట్టడం తథ్యమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గురువారం శపథం చేశారు. ప్రతీకారం తప్పదన్నారు. పేలుళ్లకు తెగబడిన వారికి దీటుగా బదులిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కమాండర్లకు ఆదేశాలు ఇచ్చారు. అందుకనుగుణంగానే తాజా వైమానిక దాడులు జరగడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని