Deadline for US: ముంచుకొస్తున్న డెడ్‌లైన్‌.. ఇంకా 300మంది అఫ్గాన్‌లోనే!

అఫ్గాన్‌లో ఇంకా దాదాపు 300 మంది అమెరికా పౌరులు ఉన్నట్లు సమాచారం. వీరందరినీ గడువులోగా తరలించే సామర్థ్యం తమకు ఉందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు పేర్కొన్నారు.

Published : 29 Aug 2021 23:09 IST

గడువులోగా తరలించే సామర్థ్యం ఉందన్న అమెరికా

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో అక్కడ నుంచి తమ పౌరులను తరలించే ప్రక్రియ ఆయా దేశాలకు సంక్లిష్టంగా మారింది. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ తంతును పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో ఇంకా దాదాపు 300 మంది అమెరికా పౌరులు ఉన్నట్లు సమాచారం. వీరందరినీ గడువులోగా తరలించే సామర్థ్యం తమకు ఉందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు పేర్కొన్నారు. వీరితోపాటు అమెరికాకు సహాయం చేసిన అఫ్గాన్‌లను కూడా తీసుకెళ్తామని పునరుద్ఘాటించారు. అయితే, గడువు ముగిసిన తర్వాత అక్కడ తమ రాయబార కార్యాలయం కొనసాగించకూడదని తాము ఓ నిర్ణయానికి వచ్చినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

ఆగస్టు 31 గడువు..

అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గాన్‌ను తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురవుతోన్న అఫ్గాన్‌ ప్రజలు విదేశాలకు పారిపోయేందుకు కాబుల్‌ విమానాశ్రయానికి చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. అదే సమయంలో అక్కడ చోటుచేసుకున్న వరుస బాంబు పేలుళ్ల ఘటనలో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన మరో రాకెట్‌ దాడిలోనూ ఓ చిన్నారి మృతి చెందింది. ఈ నేపథ్యంలో స్థానికంగా శాశ్వతమైన కార్యాలయం లేకున్నా ఉగ్రవాదాన్ని అణచివేసే సామర్థ్యం తమకు ఉందని అమెరికా పేర్కొంది. ఆగస్టు 31 గడువులోగా తమ సిబ్బందిని (300 మంది) తరలిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అయితే, మరోసారి బాంబు దాడులు జరుగుతాయనే పసిగట్టిన అమెరికా దళాలు.. కాబుల్‌ విమానాశ్రయానికి దూరంగా వెళ్లిపోవాలని అమెరికా పౌరులకు సూచించాయి.

అమెరికా సేనలకు అధ్యక్షుడు నివాళి..

కాబుల్‌ ఎయిర్‌పోర్టు వద్ద చోటుచేసుకున్న రెండు వరుస బాంబుపేలుళ్లలో 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అమెరికా, దాడులకు పాల్పడిన ఇస్లామిక్‌ స్టేట్స్‌కు తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగే చోట డ్రోన్‌ దాడి చేశామని వెల్లడించింది. ఆ దాడిలో కీలకమైన ఉగ్ర నేతలు హతమైనట్లు ప్రకటించింది. ఇటువంటి దాడులను మరిన్ని కొనసాగిస్తామని అమెరికా తన మిత్ర దేశాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక అఫ్గాన్‌లో మృతిచెందిన సైనికుల పార్థివ దేహాలు అమెరికా చేరుకోగా.. డోవెర్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతులు వారికి నివాళి అర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని