US: రికార్డు కేసులతో అమెరికా విలవిల.. ఒమిక్రాన్ మంచు తుపాను రాబోతోందన్న నిపుణులు..!

కరోనావైరస్ ధాటికి అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. కొత్త వేరియంట్ రాకతో అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.  

Updated : 31 Dec 2021 16:45 IST

చిన్నారుల్లో పెరుగుతున్న ఆసుపత్రుల్లో చేరిక

వాషింగ్టన్‌: కరోనావైరస్ ధాటికి అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. కొత్త వేరియంట్ రాకతో అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దాదాపు 5.8 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. రానున్న వారాల్లో దేశాన్ని ఒమిక్రాన్ మంచు తుపాను ముంచెత్తనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో అగ్రదేశంలో చిన్నారులు రికార్డు స్థాయిలో ఆసుపత్రుల్లో చేరుతుండటం కలవరపెడుతోంది. 

‘ఇది చాలా హృదయవిదారకరంగా ఉంది. గత సంవత్సరమైతే ఈ పరిస్థితి కష్టమే. కానీ ఇప్పుడు మనకు నివారించే మార్గాలున్నాయి’ అని ఫిలడెల్ఫియాకు చెందిన చిన్నపిల్లల వైద్యుడు అభిప్రాయపడ్డారు. చిన్నారులకు టీకాలు అందించాల్సిన ఆవశ్యకతను నిపుణులు గుర్తుచేస్తున్నారు. డిసెంబర్ 22 నుంచి 28 వరకు ముగిసిన వారంలో రోజుకు సగటున 378 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరినట్లు సీడీసీ గణాంకాలు వెల్లడించాయి. వారంతా 17 సంవత్సరాలు లేక ఆ కిందివయస్సు వారే. ఈ పెరుగుదల గత వారంతో పోల్చితే 66 శాతం అధికం కావడం గమనార్హం. సెప్టెంబర్‌లో కరోనా విజృంభించిన సమయంలో రోజుకు సగటున 342 మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరారని తెలిపింది. అయితే మొత్తంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారితో పోలిస్తే.. పిల్లల సంఖ్య తక్కువగా ఉండటం కాస్త ఊరటనిస్తోంది. అదే వారంలో అన్ని వయస్సుల వారు రోజుకు సగటున 10,200 మంది ఆసుపత్రిలో చేరారు. అలాగే చిన్నారుల్లో లక్షణాలు కూడా తక్కువగానే ఉంటున్నట్లు వైద్యులు చెప్తున్నారు.

ఇదిలా ఉండగా.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలకు రోజూవారీ కార్యకలాపాల్లో అంతరాయం కలగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెలలో వైరస్ మంచు తుపాను రాబోతుందని, దీని ద్వారా ప్రజలంతా ఒత్తిడికి గురికానున్నారని మిన్నెసోటాకు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ మైఖేల్ వ్యాఖ్యానించారు. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం..అమెరికాలో కొత్తగా 5,72,029 మందికి కరోనా సోకింది. 1,362 మంది మృతి చెందారు. మొత్తంగా 5,52,52,823 మంది మహమ్మారి బారినపడగా..8 లక్షకు పైగా మరణాలు సంభవించాయి.

ఐసోలేషన్ మార్గదర్శకాలు సవరించిన సీడీసీ.. 

కరోనా బాధితుల విషయంలో సీడీసీ ఐసోలేషన్ మార్గదర్శకాలను సవరించింది. లక్షణాలు కనిపించని బాధితులకు ఐసోలేషన్‌ సమయాన్ని ఐదు రోజులకు తగ్గించింది. వారికి ఐసోలేషన్‌ ముగించే ముందు 24 గంటల పాటు జ్వరం ఉండకూడదని స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు మిగతా ఐదు రోజులు మాస్క్‌ ధరించాలని సూచించింది.  కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో 10 రోజుల ఐసోలేషన్ సమయాన్ని 5 రోజులకు తగ్గించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తాజాగా ఈ నిబంధనల్లో మార్పు చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని