Covid: అగ్రరాజ్యంలో కరోనా ఉగ్రరూపం.. ఒకేరోజు 4.4లక్షల కేసులు

అమెరికాలో 24 గంటల వ్యవధిలో 4,41,278 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు అంటువ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) వెల్లడించింది......

Published : 29 Dec 2021 20:11 IST

వాషింగ్టన్‌: కరోనా పలు వేరియంట్లు సహా తాజా ఒమిక్రాన్ ఉద్ధృతితో అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4,41,278 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు అంటువ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) వెల్లడించింది. అయితే ఇందులో సగానికిపైగా ఒమిక్రాన్‌ కేసులే ఉండటం కలకలం రేపుతోంది. డిసెంబర్ 25తో ముగిసిన వారంలో నమోదైన కొత్త ఇన్ఫెక్షన్లలో 58.6 శాతం ఒమిక్రాన్‌ కేసులే ఉన్నాయని సీడీసీ తెలిపింది. ఈ వారంరోజుల్లో సగటున రోజుకు 240,000 కంటే ఎక్కువ కేసులే నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
కాగా ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు 11 శాతం పెరిగాయి.

తాజా వేరియంట్ వల్ల ముప్పు అధికంగానే ఉందని సీడీసీ అభిప్రాయపడింది. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, డెన్మార్ దేశాల నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి.. ఆస్పత్రుల్లో చేరే ముప్పు తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రంలోనేలో ఇప్పటివరకు 50లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇన్ని కేసులు వచ్చిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఒక్క కాలిఫోర్నియాలోనే 75,500 మంది కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు, ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా మంగళవారం 2,969 విమానాలు రద్దయ్యాయి. 11,500 వాయిదా పడ్డాయి. అయితే అమెరికాలోనే ఏకంగా 1,172 విమానాలు రద్దయ్యాయని.. 5,458 విమాన సర్వీసులు వాయిదా పడ్డాయని ‘ఫ్లైట్అవేర్’ అనే వెబ్​సైట్ వెల్లడించింది. సోమవారం సైతం భారీగా విమానాలు నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని