
Corona in US: డెల్టా ఉద్ధృతి పెరిగినా.. లాక్డౌన్లు ఉండకపోవచ్చు!
అమెరికాలో అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ అంచనా
వాషింగ్టన్: నిత్యం కొత్త రూపాలు మార్చుకుంటూ విజృంభిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ దేశాలు మరోసారి వణికిపోతున్నాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోనూ డెల్టా వేరియంట్ ఉద్ధృతి పెరిగింది. దీంతో నిత్యం పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ అమెరికాలో మరోసారి లాక్డౌన్ విధించే పరిస్థితులు ఉత్పన్నం కాకపోవచ్చని అమెరికాలో ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అధ్యక్షుడు జో బైడెన్‌కు ముఖ్య ఆరోగ్య సలహాదారుడు డాక్టర్ ఆంటోని ఫౌచీ అంచనా వేశారు. కానీ, ప్రస్తుతం డెల్టా ప్రభావంతో పరిస్థితులు కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయని హెచ్చరించారు.
‘గతేడాది మాదిరిగా లాక్డౌన్లు విధించే పరిస్థితులు రానప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా డెల్టా వైరస్ ప్రభావంతో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయి’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోని ఫౌచీ హెచ్చరించారు. పది కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సినవారు ఉన్నప్పటికీ.. వారు ముందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ల పనితీరుపై వస్తోన్న నివేదికలపై స్పందించిన ఫౌచీ.. తీవ్ర అనారోగ్యం, ఆస్పత్రి బారినపడకుండా వ్యాక్సిన్లు సమర్థవంతంగా కాపాడుతాయని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ సోకినా.. వైరస్ నుంచి పూర్తి రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న 16కోట్ల మందిలో కేవలం 6,239 మంది మాత్రమే ఆస్పత్రిలో చేరారని.. వారిలో 1263 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (CDC) వెల్లడించింది.
ఇదిలాఉంటే, అమెరికాలో గతకొన్ని రోజులుగా రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. పది రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అక్కడ రెట్టింపు కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఫ్లోరిడా వంటి నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చేరికలు కూడా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారుకూడా ఇండోర్ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలంటూ సీడీసీ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.