
Covid: విమాన ప్రయాణంలో కొవిడ్ పాజిటివ్.. బాత్రూంలోనే ఐసోలేషన్!
అనూహ్య పరిణామంతో కంగుతిన్న అమెరికా మహిళ
న్యూయార్క్: విమాన ప్రయాణంలో ఉండగానే ఓ ప్రయాణికురాలికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ప్రయాణం మధ్యలోనే పాజిటివ్‌గా తేలడంతో విమానంలోని బాత్రూంలోనే కొన్ని గంటలపాటు ఐసోలేషన్‌లో ఉంచాల్సి రావడం గమనార్హం. డిసెంబర్ 19న అమెరికాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అమెరికాలోని మిషిగాన్‌కు చెందిన మరీసా ఫొటియో అనే ఉపాధ్యాయురాలు చికాగో నుంచి ఐస్లాండ్కు ప్రయాణమయ్యారు. విమాన ప్రయాణం ప్రారంభమైన కొద్ది సమయానికే ఆ మహిళకు గొంతులో నొప్పిరావడం మొదలయ్యింది. దీంతో ఆందోళన చెందిన ఆమె.. అక్కడే అందుబాటులో ఉన్న ర్యాపిడ్ టెస్టు చేసుకున్నారు. టెస్టులో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆ మహిళ ఒక్కసారిగా కంగుతింది. ఆ సమయంలో ఎదురైన అనుభవాన్ని అమెరికాకు చెందిన ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘ప్రయాణానికి ముందు రెండుసార్లు పీసీఆర్ పరీక్షలు, ఐదుసార్లు ర్యాపిడ్ టెస్టులు జరిపించుకోగా వాటన్నింటిలోనూ నెగెటివ్ వచ్చింది. విమానం ఎక్కి ప్రయాణం ప్రారంభమైన కొన్ని గంటలకే గొంతునొప్పిగా అనిపించింది. దాంతో ఏదో అవుతోందని మనసులో అనిపించి.. చివరకు కొవిడ్ టెస్టు చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. వెంటనే అక్కడే ఉన్న ర్యాపిడ్ టెస్టు చేసుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఊహించని పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాను’ అని ఫొటియో పేర్కొన్నారు. దీంతో ఏడ్చుకుంటూ విమాన సిబ్బందికి తెలియజేశానని.. ఆ సమయంలో అంతకుముందే నాతో కలిసి భోజనం చేసిన నా కుటుంబ సభ్యులు, విమానంలోని తోటి ప్రయాణికుల గురించి తీవ్ర ఆందోళన చెందానంటూ ఫొటియో తనకు ఎదురైన అనూహ్య పరిణామం గురించి వివరించారు.
ఆ సమయంలో స్పందించిన తీరు గురించి విమాన సిబ్బంది వివరించారు. పాజిటివ్‌గా తేలిన ఫొటియోకు మరో సీటు సమకూర్చేందుకు ప్రయత్నించినప్పటికీ సీట్లన్నీ నిండుగా ఉండడంతో అది కుదరలేదు. దీంతో ఆమెను బాత్రూంలోనే ఐసోలేషన్‌లో ఉంచాం. వెంటనే బయట నుంచి ‘ఔట్ ఆఫ్ సర్వీస్’ అనే స్టిక్కర్ అంటించాం. అనంతరం ఐస్‌ల్యాండ్‌లో విమానం దిగగానే ఫొటియోతోపాటు ఆమె కుటుంబ సభ్యులను మాత్రం చివర్లో పంపించాం. విమానాశ్రయంలో జరిపిన ర్యాపిడ్, పీసీఆర్ పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది’ అని విమాన సిబ్బంది రాకీ వెల్లడించారు. అయితే, పాజిటివ్ వచ్చిన మహిళ ఇప్పటికే పూర్తి మోతాదులో కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారని తెలిపారు.
ఇలా విమాన ప్రయాణంలో కొవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తులను గుర్తించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తాజా ఘటన మరోసారి గుర్తుచేస్తోందని విమాన సిబ్బంది అభిప్రాయపడ్డారు. ఇలాంటి అనూహ్య సంఘటనలు ఎదురైనప్పుడు అన్ని విమాన సంస్థల్లో ఒకేరకమైన నిబంధనలు ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని తాజా ఘటన నొక్కిచెబుతోందని అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.