2021: ‘వ్యాక్సిన్లు, బూస్టర్లు, వేరియంట్లు’.. ఆశలతో మొదలై.. ఆందోళనతో ముగుస్తూ!

ఈ ఏడాది వ్యాక్సిన్ల ఆశలు, బూస్టర్‌లతో ప్రగతి సాధించినప్పటికీ.. కొత్తగా వెలుగు చూస్తోన్న ఆందోళనకర వేరియంట్లు విసురుతున్న సవాళ్లతో ఏడాదికి ముగింపు పలుకుతూ కొత్త ఏడాదిలోకి ప్రపంచ దేశాలు అడుగుపెడుతున్నాయి.

Updated : 29 Dec 2021 16:21 IST

ఎప్పటికప్పుడు సంసిద్ధతే ముఖ్యమంటున్న నిపుణులు

దిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఏడాది పాటు ప్రపంచదేశాలు ఎదురుచూడాల్సి వచ్చింది. 2019 డిసెంబర్‌లో చైనాలో వెలుగు చూసిన ఈ మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్‌ ఏడాదిలోనే అందుబాటులోకి రావడంతో దేశాలన్నీ ఊపిరిపీల్చుకున్నాయి. వైరస్‌కు ముగింపు పలకాలనే ఆశలతో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రపంచ దేశాలు.. కొవిడ్‌ను ఎదుర్కొనే వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలో కొవిడ్‌ విజృంభణతో సతమతమవుతోన్న భారత్‌ కూడా జనవరి 16, 2021న వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించింది. ఇప్పటికే 90శాతం అర్హులకు కనీసం ఒక డోసు పంపిణీ చేసింది. అంతేకాకుండా ముందుజాగ్రత్తగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ‘ప్రికాషన్‌ డోసు’ కూడా ఇస్తామని ప్రకటించింది. ఇలా ఈ ఏడాది వ్యాక్సిన్ల ఆశలు, బూస్టర్‌లతో ప్రగతి సాధించినప్పటికీ.. కొత్తగా వెలుగు చూస్తోన్న ఆందోళనకర వేరియంట్లు విసురుతున్న సవాళ్లతో ఏడాదికి ముగింపు పలుకుతూ కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాయి.

వ్యాక్సిన్లు..

కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ పంపిణీ ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 900కోట్ల డోసులను అందించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటు భారత్‌లోనూ 143 కోట్ల డోసులను అందించారు. అయితే తొలుత వెలుగు చూసిన అల్ఫా, బీటా, గామా వంటి వేరియంట్లను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగానే పనిచేశాయి. అనంతరం డెల్టా రూపంలో ఊహించని రీతిలో విరుచుకుపడిన మహమ్మారి భారత్‌తోపాటు పలు దేశాల్లో వేల మంది ప్రాణాలను బలితీసుకుంది. కొన్నిరోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఈ వేరియంట్‌ను నిరోధించడంలో వ్యాక్సిన్‌లు కాస్త తక్కువ సామర్థ్యాన్నే చూపించినట్లు వెల్లడైంది. అయినప్పటికీ తీవ్ర వ్యాధి, మరణం ముప్పు నుంచి వ్యాక్సిన్లు రక్షిస్తున్నట్లు తేలడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇదే సమయంలో కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో బూస్టర్‌ డోసుకు సిద్ధమయ్యాయి.

బూస్టర్లు..

ఇలా కొత్త వేరియంట్లు ముంచుకొస్తున్న వేళ ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీని ముమ్మరం చేశాయి. కొన్ని పేద దేశాలు మినహా చాలా దేశాల్లో సగం జనాభాకు పూర్తి మోతాదుల్లో వ్యాక్సిన్‌ పూర్తి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెరికా, యూరప్‌ వంటి దేశాలు బూస్టర్‌ డోసుపై శ్రద్ధ పెట్టాయి. ఇప్పటికే అమెరికాలో అర్హులైన వారిలో 25శాతం మందికి మూడో డోసు అందించారు. ఇటు భారత్‌ కూడా ప్రికాషన్‌ డోసు ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. మరో అడుగు ముందుకేసిన ఇజ్రాయెల్‌ మూడోడోసు పంపిణీని జూన్‌ నెలలోనే మొదలుపెట్టింది. ప్రస్తుతం నాలుగో డోసు పనితీరు ఫలితాలను విశ్లేషించే పనిలో పడింది. ఇలా ఈ ఏడాది బూస్టర్‌ డోసుపైనా ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి.

కొత్త వేరియంట్ల సవాల్..

ఈ ఏడాది ప్రారంభంలో ఎలా విజృంభించిందో ప్రస్తుతం అదే రీతిలో వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోందని ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్‌ సత్యజిత్‌ రథ్‌ పేర్కొన్నారు. ఇలా ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్లు రావడం సహజమేనన్న ఆయన ఇన్‌ఫ్లుయెంజాను ఉదహరించారు. అందుకే ఈ మహమ్మారి ఒక్కసారిగా అంతమవుతుందని ఆశించడం వాస్తవం కాదని చెప్పడానికి కారణాల్లో ఇదొకటి అని పేర్కొన్నారు. ‘శ్వాసకోస వ్యాధులకు కారణమయ్యే ఇతర వైరస్‌లకు సార్స్‌-కోవ్‌-2 ఎంత దగ్గరగా ఉందో మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం వైరస్‌ ప్రభావం, ఎదుర్కొనే భిన్న మార్గాలకు అర్థం చేసుకుంటున్నాం. ఇదే సమయంలో కొత్త వేరియంట్లు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి’ అని అశోకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ గౌతమ్‌ మేనన్‌ పేర్కొన్నారు. ఇందులో భాగమే ‘ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ట్విస్ట్‌’ అని అభిప్రాయపడ్డారు.

ఇలా వైరస్‌ మ్యుటేషన్‌ చెందడం కొనసాగుతూనే ఉంటుందని.. వాటిలో కొన్ని వేగంగా వ్యాప్తిచెందేవి ఉంటే, యాంటీబాడీలను ఏమార్చేవి మరికొన్ని ఉంటాయని కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయోలజీకి చెందిన వైరాలజిస్ట్‌ ఉపాసనా రాయ్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ వ్యాక్సిన్‌లతో పాటు ఇదివరకు ఇన్‌ఫెక్షన్‌ వల్ల పొందిన యాంటీబాడీలతో రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.

రోగనిరోధక శక్తిని ఏమార్చుతూ, అత్యంత వేగంగా వ్యాపించే ఒమిక్రాన్‌ వంటి వేరియంట్లు మరిన్ని సాధ్యమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడం, కొత్త వ్యాక్సిన్లు రూపొందించడం, చికిత్సా పద్ధతులపైనే వచ్చే ఏడాది ప్రధాన దృష్టి ఉంటుందని చెబుతున్నారు. యాంటీబాడీలను ఏమార్చే వేరియంట్లను నిరోధించాలంటే ముందుగా వైరస్‌ వ్యాప్తి గొలుసుకు అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు. ఇందుకోసం సాధ్యమైంత త్వరగా వైరస్‌ గుర్తింపు, బాధితుల ఐసోలేషన్‌తోపాటు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సిన్‌ అందినప్పుడే వైరస్‌ ముప్పు తొలగిపోతుందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు