Updated : 01/12/2021 08:28 IST

Shahid Jameel: ఒమిక్రాన్‌పై భయాందోళనలు వద్దు.. భారతీయులకు రక్షణే! 

ప్రముఖ వైరాలజిస్ట్‌ షాహిద్‌ జమీల్‌

దిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రమాదకారిగా మారవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ మరోసారి అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలా ఒమిక్రాన్‌ ముప్పు పొంచివున్న నేపథ్యంలో అప్రమత్తమైన భారత్‌.. ఈ వేరియంట్‌ వ్యాప్తిచెందిన దేశాలను ‘హై రిస్క్‌’ దేశాల జాబితాలో చేర్చింది. అయినప్పటికీ మన దేశ జనాభాలో అత్యధిక శాతం మంది ఒమిక్రాన్‌తో పాటు ఇతర వేరియంట్‌ల నుంచి రక్షణ పొందే అవకాశం ఉందని ప్రముఖ వైరాలజిస్ట్‌ షాహిద్ జమీల్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌తో భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్న ఆయన.. మాస్కులు ధరించడంతో పాటు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మెజారిటీ ప్రజల్లో యాంటీబాడీలు..

‘జాగ్రత్తగా ఉండాల్సిందే కానీ భయం అవసరం లేదు. డెల్టా వేరియంట్‌ ప్రభావంతో భారత్‌లో మనం ఊహించిన దానికంటే ఎక్కువ మందికే వైరస్‌ సోకింది. దాదాపు 67శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్లు దేశవ్యాప్తంగా జరిపిన నాలుగో సీరో సర్వేలో తేలింది. అంటే వ్యాక్సినేషన్‌ తక్కువగా ఉన్న సమయానికే దాదాపు 93 నుంచి 94కోట్ల మందికి వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే యాంటీబాడీలు పొందిన వారిలో అత్యధికశాతం వైరస్‌ నుంచే వాటిని పొందారని అర్థమవుతోంది’ అని గతంలో ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) బృందానికి నేతృత్వం వహించిన ప్రముఖ వైరాలజిస్ట్‌ షాహిద్ జమీల్‌ పేర్కొన్నారు. ఇక దిల్లీలో ఈమధ్యే చేపట్టిన సర్వేలో 97శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు తేలగా ముంబయిలో 85-90శాతం మందిలో కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నట్లు వెల్లడైన విషయాన్ని గుర్తుచేశారు. అందుకే దేశ జనాభాలో అధికశాతం మంది ఒమిక్రాన్‌తో పాటు ఇతర వేరియంట్ల నుంచి రక్షణ ఉన్నట్లేనని షాహిద్‌ జమీల్‌ అభిప్రాయపడ్డారు.

టీకా సమర్థత తగ్గినప్పటికీ..

ఆందోళనకర వేరియంట్‌గా మారిన ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడంలో టీకాలు ఏ మేరకు సమర్థత చూపిస్తాయో అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మరింత సమాచారం రావాల్సి ఉందని షాహిద్‌ జమీల్‌ పేర్కొన్నారు. ఇందుకు మరో రెండు, మూడు వారాల సమయం పట్టవచ్చన్నారు. ఒకవేళ వ్యాక్సిన్‌ల సమర్థత క్షీణించినప్పటికీ.. టీకాలు వృథా అయ్యే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా తీవ్ర వ్యాధి నుంచి వ్యాక్సిన్‌లు తప్పకుండా రక్షిస్తాయని షాహిద్‌ జమీల్‌ భరోసా వ్యక్తం చేశారు.

భయాందోళన వద్దు..

ఇక ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నకు స్పందించిన షాహిద్‌ జమీల్‌.. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం మాత్రం లేదన్నారు. ప్రజలు మాస్కులు ధరించడంతో పాటు ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్‌ను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. దేశ ప్రజలకు సరిపడా వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉండడం మన అదృష్టమన్న ఆయన.. దీనివల్ల డోసుల మధ్య వ్యవధి తగ్గించేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించవచ్చని.. ముఖ్యంగా ముప్పు ఎక్కువగా వారికి త్వరగా వ్యాక్సిన్‌ అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. బూస్టర్‌ డోసులపై చర్చ జరుగుతోన్న నేపథ్యంలో.. అవి అందించడం ప్రయోజనకరమేనని షాహిద్‌ జమీల్‌ పేర్కొన్నారు. అయితే, ముందుగా వ్యాక్సిన్‌ తీసుకోని వారికి తొలి రెండు డోసులు అందించడమే అత్యంత ప్రాధాన్యమని డాక్టర్‌ జమీల్‌ స్పష్టం చేశారు.

 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని