Vice President: ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేద్దాం: వెంకయ్య

క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ..

Updated : 08 Aug 2021 17:16 IST

దిల్లీ: క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సాధించండి లేదా మరణించండి అంటూ 1942 ఆగస్టు 9న గాంధీ మహాత్ముడు ఇచ్చిన శక్తివంతమైన నినాదం స్వరాజ్య ఉద్యమం దిశగా స్ఫూర్తిని రేకెత్తించి దేశ ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. 1947లో బ్రిటీష్‌ పాలకులు భారత దేశాన్ని విడిచి వెళ్లడంలో ఇదో కీలకఘట్టంగా నిలిచింది. భారతదేశాన్ని వలస పాలన నుంచి విముక్తం చేయడానికి తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన భారతమాత వీరపుత్రులు, వీరనారీమణుల త్యాగాలను ఈ సందర్బంగా గుర్తు చేసుకుందాం. వారి స్ఫూర్తితో పేదరికం, నిరక్షరాస్యత, అసమానతలు, అవినీతి, కుల-మత-సామాజిక-లింగ వివక్షలను రూపుమాపి, అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు పునరంకితమౌదాం. మనకున్న దానిని నలుగురితో పంచుకోవడం, నలుగురి సంక్షేమం పట్ల శ్రద్ధ వహించడం (షేర్ అండ్ కేర్) అనే ఉన్నతమైన విలువలు భారతీయ నాగరికతకు పునాదులు. మన సమాజంలో సామరస్యం, సోదరభావం, పరస్పర గౌరవం, బాధ్యతలను పెంపొందించే దిశగా ఇవి మనకు మార్గదర్శకం కాగలవని ఆశిస్తున్నాను.

అనేక భాషలు, వివిధ సంస్కృతుల నిలయమైన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయలమనే భావన మనకు గర్వకారణం. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరిలో ఆత్మీయ సోదరభావన పెంపొందాలి. ఉన్నతమైన భవిష్యత్ భారత నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇందులో భాగంగా ముందుగా భారతీయతను మన జీవితాల్లోకి స్వాగతిద్దాం. భారతీయ జీవన పద్ధతిని ప్రోత్సహించుకుందాం. మన మాతృభాషను కాపాడుకుందాం. పరభాషల పట్ల సహనాన్ని చూపుదాం. మనదైన వస్త్రధారణ మరియు సంస్కృతి సంప్రదాయాలను అనుసరిద్దాం. ఇతరుల సంప్రదాయాలను గౌరవిద్దాం. భారతదేశం మనందరిది. భారతీయులమైనందుకు గర్విద్దాం. అందరం సంఘటితమై ఆత్మవిశ్వాసంతో కూడిన ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేద్దాం. జైహింద్...’’ అని ఉపరాష్ట్రపతి దేశ ప్రజలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని