Vinayaka Chaturthi: దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని వినాయక చవితి శుభాకాంక్షలు!

వినాయక చతుర్థి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 10 Sep 2021 10:46 IST

దిల్లీ: వినాయక చతుర్థి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్‌ మహమ్మారిపై మనం చేస్తోన్న పోరాటం విజయవంతం కావాలని, ప్రతి ఒక్కరినీ సంతోషంగా ఉంచేలా దీవించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు రాష్ట్రపతి ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఈ వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్ని అందిస్తూ.. సమస్త జీవుల సమ భావనకు ప్రతీకగా వినాయక చవితి నిలుస్తుందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ప్రస్తుతం కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా జ్ఞానం, శ్రేయస్సు, ఆనందం, ఆరోగ్యాలను అందించే వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకొందామని పిలుపునిచ్చారు.

గణేశ్‌ పండుగ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభ సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, సౌభాగ్యాలతో పాటు ఆరోగ్యాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గణపతి బప్పా మోరియా అంటూ ప్రధాని మోదీ ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

ఆంక్షల నడుమ దేశవ్యాప్తంగా వేడుకలు..

దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఆంక్షల మధ్య వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకొంటున్నారు. దేశ రాజధాని దిల్లీలో గణేష్‌ ఉత్సవాలను బహిరంగంగా నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. కొవిడ్‌ తీవ్రతకు వణికిపోయిన మహరాష్ట్ర.. వినాయక చవితి ఉత్సవాల సమయంలో పలు ఆంక్షలు విధించింది. వైరస్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముంబయిలో ఈ నెల 19వరకు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. బహిరంగ ఉత్సవాలు, ఊరేగింపులపైనా నిషేధం విధించిన అధికారులు, గణనాథులను ఆన్‌లైన్‌లో దర్శించుకోవాలని సూచించారు. అటు ఉత్తరప్రదేశ్‌లోనూ బహిరంగ విగ్రహాల ఏర్పాటుపై నిషేధం విధించారు. ఇక తమిళనాడులోనూ పండగలు, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కొవిడ్‌ నిబంధనల మధ్య వేడుకలు జరుపుకోవాలని ఇరు ప్రభుత్వాలు సూచించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని