
US VISA: అమెరికా వీసా.. అపాయింట్మెంట్కు తప్పని నిరీక్షణ!
వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్న యూఎస్ ఎంబసీ
దిల్లీ: కొవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విదేశీ ప్రయాణాలపై అమెరికా విధించిన ఆంక్షలను ఈమధ్యే తొలగించిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 8 నుంచి అమెరికా వెళ్లేందుకు వివిధ దేశాల ప్రయాణికులతో పాటు భారతీయులకు కూడా మార్గం సుగమమయ్యింది. ఇదే సమయంలో అమెరికా వీసా కోసం ఎదురుచూసే భారతీయులకు మరింత సమయం నిరీక్షించాల్సి రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ వారి అపాయింట్ కోసం వేచిచూసే సమయం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. వీసా జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.
‘అమెరికా ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడమే మా తొలి ప్రాధాన్యత. కొవిడ్ వల్ల కలిగిన అంతరాయం నుంచి ఇప్పుడిప్పుడే తిరిగి సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమ రాయబార, కాన్సులేట్ కార్యాలయాల్లో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా విభాగాల వారి అపాయింట్మెంట్కు నిరీక్షణ సమయం ఎక్కువగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నాం’ అని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతోపాటు దరఖాస్తుదారులు, సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నామని తెలిపింది.
తాజా నిర్ణయం ద్వారా అమెరికా వీసా పొందిన 30 లక్షల మంది భారతీయులు ప్రయాణం చేయవచ్చని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ లిస్టింగ్ జాబితాలో ఉన్న కొవిడ్ టీకా లేదా అమెరికా సీడీసీ ఆమోదం పొందిన వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొంది. దీంతో ప్రయాణ సమయంలో కొవిడ్ టీకా తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని ప్రయాణికులు చూపించాల్సి ఉంటుంది. 18ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి టీకా ధ్రువీకరణ నుంచి మినహాయింపు లభించనుంది.