China: ఆమెకు ఖర్చు అంటే భయమట..అందుకే రెండిళ్లు కొనేసింది..!

మనకు మొదటి తారీఖు జీతం పడగానే ఏం చేస్తాం.. ఈ సారి ఖర్చులేంటి, వాటిపోగా ఎంత మిగిలిందని చూసుకుంటాం. మిగలకపోతే ఊసూరుమంటూ వచ్చే నెలకోసం ఎదురుచూస్తాం.

Updated : 05 Nov 2021 23:34 IST

9 ఏళ్లు 90 శాతం జీతం పొదుపునకే..

బీజింగ్: మనకు మొదటి తారీఖున జీతం రాగానే ఏం చేస్తాం.. ఈ సారి ఖర్చులేంటి, వాటిపోగా ఎంత మిగిలిందని చూసుకుంటాం. మిగలకపోతే ఉసూరుమంటూ వచ్చే నెలకోసం ఎదురుచూస్తాం. కానీ చైనాకు చెందిన 32 ఏళ్ల షెనాయి మాత్రం జీతం రాగానే పొదుపు చేయడం గురించే ఆలోచిస్తుంది. ఏదో పది శాతమో, 20 శాతమో కాదు.. ఏకంగా 90 శాతం దాచేస్తోంది. అలా కూడబెట్టి.. తొమ్మిదేళ్లలో రెండు ఇళ్లు కొనేసింది. అమ్మో అవునా అనిపిస్తుంది కదా..! మరి కనీస అవసరాలు ఎలా తీరాయబ్బా అనుకుంటున్నారా..! అయితే ఇది చదివేయండి!

తాను చేస్తోన్న పొదుపు గురించి షెనాయి చైనా కంపెనీ టెన్సెంట్‌తో మాట్లాడుతూ.. ‘నేనెప్పుడు బయట ఆహారం తీసుకోలేదు. స్నేహితులతో బయటకు వెళ్లడం, విలాసవంతమైన వస్తువులపై ఖర్చు పెట్టడంలాంటివి చేయనే చేయలేదు. వాడేసి, తక్కువ ధరలో దొరికే ఫర్నీచర్ మాత్రమే కొనేదాన్ని. దుస్తుల కోసం నేను వెచ్చించే డబ్బు చాలా తక్కువ. నా స్నేహితులు నుంచి సెకండ్ హ్యాండ్ దుస్తులు తీసుకునేదాన్ని. ప్రజా రవాణా తప్ప.. ప్రైవేటు వాహనం జోలికివెళ్లేదాన్నే కాదు. కొంతమంది తమకు ఇష్టమైన వాటి మీద డబ్బు ఖర్చుపెట్టాక మంచి అనుభూతి పొందుతారు. నాకు డబ్బు ఖర్చుపెట్టడం అంటే భయం, ఆందోళన వస్తుంది’ అని వెల్లడించింది. ఆమె భర్త కూడా ఇప్పటికే పాత మోడల్ ఫోన్‌ వాడుతున్నారట. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈమె చైనాలోని నాన్జింగ్ నగరంలో రెండు ఇళ్లు కొనుగోలు చేసింది. 

ఈ వాంగ్ షెనాయి డిజైనింగ్‌లో డిగ్రీ పట్టా పొందింది. ప్రకటన రంగంలో పనిచేసిన అనుభవం ఉంది. అదే తాను తక్కువ ఖర్చు పెట్టేలా చేసిందని చెప్పారు. అలాగే ఈమె అతి పొదుపు చిట్కాలను వినే ఆన్‌లైన్ గ్రూప్‌ కూడా ఉంది. దానిలో నాలుగు లక్షల మంది సభ్యులు ఉన్నారు.  కాగా, ఈమె జీవనశైలిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘మీరు చనిపోతే డబ్బు వెంట తీసుకెళ్లలేరు’, ‘ఈ అతి పొదుపు గురించి మీడియా ప్రచారం చేయకూడదు. చాలా పొదుపుగానే ఉన్నా.. భారీస్థాయిలో ఉన్న ఇళ్ల ధరల కారణంగా చాలామంది వాటిని కొనుగోలు చేయలేరు’ అంటూ విమర్శించారు. ఆమె తెలివైందని, ఇన్ని సౌకర్యాలు ఎదురుగా కన్పిస్తున్నా.. ఆమెలా జీవించడం చాలా కష్టమని మరికొందరు ప్రశంసించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని