Vaccine Booster: కొత్త వేరియంట్లకు బూస్టర్‌ డోస్ అవసరమే.. ఎయిమ్స్‌ చీఫ్‌ వ్యాఖ్యలు

కరోనా మహమ్మారిలో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశమున్న నేపథ్యంలో వాటి కట్టడికి బూస్టర్‌ డోసులు అవసరం పడే అవకాశముందని ఎయిమ్స్‌ చీఫ్‌ డా. రణదీప్‌ గులేరియా

Updated : 24 Jul 2021 11:57 IST

దిల్లీ: కరోనా మహమ్మారిలో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశమున్న నేపథ్యంలో వాటి కట్టడికి బూస్టర్‌ డోసులు అవసరం పడే అవకాశముందని ఎయిమ్స్‌ చీఫ్‌ డా. రణదీప్‌ గులేరియా అభిప్రాయం వ్యక్తం చేశారు. కొవిడ్‌ కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి క్షీణిస్తున్న సమయంలో కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతాయని ఆయన పేర్కొన్నారు.  

‘‘ప్రస్తుతం చాలా మందిలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తూ వస్తోంది. అందువల్ల కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేలా మనకు బూస్టర్‌ డోసుల అవసరం ఉంది. రోగనిరోధక శక్తిని పెంచేలా, అన్ని రకాల కరోనా వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉండే రెండో తరం టీకాలు రాబోతున్నాయి. ఇప్పటికే బూస్టర్‌ డోసులపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. బహుశా.. ఈ ఏడాది చివరి నాటికి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అయితే మొదట ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాతే ఈ బూస్టర్‌ డోసుల పంపిణీ ఉంటుంది’’ అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గులేరియా వివరించారు. 

సెప్టెంబరు నాటికి చిన్నారులకు టీకా..

ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి దేశంలో చిన్నారులకు టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు రణదీప్‌ గులేరియా వెల్లడించారు. ‘‘ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో చిన్నారులపై ప్రయోగాలు జరుగుతున్నాయి. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు సంబంధించి పిల్లలపై ప్రయోగాలు తుదిదశలో ఉన్నాయి. సెప్టెంబరు నాటికి వాటి ఫలితాలు వచ్చే అవకాశముంది. మరో సంస్థ జైడస్‌ క్యాడిలా ఇటీవల అత్యవసర అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులో చిన్నారులపై ప్రయోగాల వివరాలను కూడా అందించింది. మరికొన్ని వారాలు లేదా సెప్టెంబరు చివరినాటికి దేశంలో చిన్నారులకు టీకా అందుబాటులోకి రావొచ్చు. అప్పుడు దశల వారీగా స్కూళ్లు కూడా తెరిచేందుకు వీలుంటుంది’’ అని గులేరియా చెప్పుకొచ్చారు.

గుజరాత్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా జైకోవ్‌-డి టీకాను తయారు చేసింది. 12-18 ఏళ్ల వారిపై కూడా ప్రయోగాలు జరిపింది. ఇటీవల ఆ వివరాలతో కూడిన డేటాను కేంద్రానికి సమర్పించి అత్యవసర వినియోగ అనుమతులు కోరింది. త్వరలోనే జైడస్‌ క్యాడిలా టీకా వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపే అవకాశాలు కన్పిస్తున్నాయి. అటు చిన్నారులపై కొవాగ్జిన్‌ టీకా ప్రయోగాలు శరవేగంగా సాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని