Rahul Gandhi: బూస్టర్‌ డోసును ఎప్పుడు మొదలుపెడతారు..?

దేశంలో ఇంకా చాలా మందికి వ్యాక్సిన్‌ అందలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Published : 22 Dec 2021 14:41 IST

మెజారిటీ ప్రజలకు ఇంకా టీకా అందలేదన్న రాహుల్‌ గాంధీ

దిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా డెల్టాతో పోలిస్తే మూడు రెట్ల వేగంతో వ్యాపించే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్రాలన్నీ సంసిద్ధంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో దేశంలో ఇంకా చాలా మందికి వ్యాక్సిన్‌ అందలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవాలంటే కనీసం 60శాతం మందికి వ్యాక్సిన్‌ అందించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 42శాతం మందికే పూర్తిమోతాదులో వ్యాక్సిన్‌ చేరిన విషయాన్ని గుర్తుచేశారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి మీడియాలో వచ్చిన సమాచారాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసిన ఆయన.. బూస్టర్‌ డోసు పంపిణీ ఎప్పుడు మొదలు పెడతారని అన్నారు.

‘థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవాలంటే డిసెంబర్‌ 2021 నాటికి 60శాతం మందికి రెండు డోసులు ఇవ్వాలనేది లక్ష్యం. కానీ ప్రస్తుతం రోజుకు సరాసరి 58లక్షల డోసులు మాత్రమే పంపిణీ జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే డిసెంబర్‌ చివరినాటికి కేవలం 42శాతం మందికి మాత్రమే పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ అందించగలం. ఈ లెక్కన డిసెంబర్‌ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇలా దేశంలో మెజారిటీ ప్రజలకు ఇంకా వ్యాక్సిన్‌ అందలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోసును ఎప్పుడు ప్రారంభిస్తుంది?’ అంటూ రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా 138 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో 82కోట్లను తొలి డోసుగా అందించగా.. 55కోట్ల డోసులను రెండో డోసుగా అందించారు. వీటితో పాటు ఇప్పటివరకు 94దేశాలకు భారత్ కరోనా టీకాలను సరఫరా చేసినట్లు కేంద్రం ఈమధ్యే వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని