Taliban Supreme Leader: తాలిబన్‌ చీఫ్‌ హైబతుల్లా ఎక్కడ..?

తాలిబన్‌ సుప్రీం లీడర్‌ హైబతుల్లా అఖుంద్‌జాదా ఎక్కడ ఉన్నాడనే విషయంపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఆయన పాకిస్థాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్నారని అంతర్జాతీయ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

Published : 20 Aug 2021 17:36 IST

పాక్‌ ఆర్మీ కస్టడీలో ఉన్నట్లు నిఘా వర్గాల అనుమానం

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందుకు తాలిబన్లలో కీలక నేతలుగా చెప్పుకుంటున్న వారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కొనసాగుతున్నాయి. అయితే, గత కొన్ని నెలల నుంచి తాలిబన్ల సుప్రీం లీడర్‌ హైబతుల్లా అఖుంద్‌జాదా మాత్రం కనిపించడం లేదు. రెండు దశాబ్దాల తర్వాత అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న కీలక సమయం తర్వాత కూడా ఆయన జాడ కనిపించలేదు. దీంతో హైబతుల్లా ఎక్కడ ఉన్నాడనే విషయంపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఆయన పాకిస్థాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్నారని అంతర్జాతీయ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

రహస్య ప్రాంతాల్లోనే అగ్రనేతలు..

తాలిబన్లకు సుప్రీం లీడర్లుగా వ్యవహరించే వారు బాహ్యప్రపంచానికి తక్కువగానే కనిపిస్తుంటారు. సాధారణ కార్యకలాపాలను వారి అనుచరులకు అప్పజెప్పి.. కీలక వ్యూహాలు, వ్యవహారాలను మాత్రం పర్యవేక్షిస్తుంటారు. అంతకుముందు తాలిబన్ల అగ్రనేతలుగా ఉన్నవారు కూడా రహస్య ప్రదేశాల్లోనే ఉండేవారు. కనీసం వారు బ్రతికి ఉన్నారో లేదో విషయాలు కూడా బయటకు తెలియనివ్వలేదు. తాలిబన్ల వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా ఒమర్‌ 2013లో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం తాలిబన్లకు చీఫ్‌గా వ్యవహరించిన అఖ్తర్‌ మన్సూర్‌ 2016లో అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో హతమయ్యాడు. 2016 మే నుంచి తాలిబన్‌ల సుప్రీం లీడర్‌గా హైబతుల్లా అఖుంద్‌జాదా నియమితుడయ్యాడు. తాలిబన్లకు నేతృత్వం వహించిన మూడో నాయకుడు ఇతడే.

దాదాపు 60ఏళ్ల వయసు ఉన్నట్లు భావిస్తోన్న అఖుంద్‌జాదాను తాలిబన్ల బృందంలో కేవలం సైనికుడిగానే కాకుండా రాజకీయ, మిలటరీ, న్యాయపరమైన అంశాల్లో మంచి పట్టున్న వ్యక్తిగా అభివర్ణిస్తారు. తాలిబన్లకు నాయకత్వం వహిస్తోన్న ఐదారుగురు కీలక నేతల్లో హైబతుల్లా అఖుంద్‌జాదా ముందున్నారు. అయితే, తాజాగా అఫ్గాన్‌ తాలిబన్ల నియంత్రణలోకి వచ్చిన తర్వాత హైబతుల్లానే పాలనా పగ్గాలు చేపడతారనే వార్తలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ నిఘా వర్గాలు మాత్రం ఆయన పాక్ ఆర్మీ ఆధీనంలో రక్షణ పొందుతుండవచ్చని అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే, అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు తమ నియంత్రణలోకి తీసుకున్న తర్వాత అల్‌ఖైదా వంటి ఉగ్రవాద ముఠాలు రెచ్చిపోయే ప్రమాదం ఉన్నట్లు వివిధ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సిరియా, తూర్పు ఆఫ్రికా దేశాల్లో అల్‌ఖైదా, ఐసిస్‌లు ప్రాబల్యం పెంచుకోవడంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. ఇక తాలిబన్ల నాయకత్వంపై స్పందించడం తొందరపాటేనని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. లష్కర్‌ఏ తోయిబా, జైషే మొహమ్మద్‌ వంటి ఉగ్ర ముఠాలకు కొందరు మద్దతు ఇస్తున్నారన్న కేంద్ర మంత్రి జైశంకర్‌.. వారు తాలిబన్లతో కలిసిపోయే ప్రమాదమూ లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనా అఫ్గాన్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిస్థితులను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని