WHO: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌గా రెండోసారి టెడ్రోస్‌ అధనామ్‌..!

ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) డైరెక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధనామ్.. వరుసగా రెండోసారి ఆ పదవికి ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం అయినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

Updated : 13 Sep 2022 15:00 IST

మార్గం సుగమం అయ్యిందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) డైరెక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధనామ్ వరుసగా రెండోసారి ఆ పదవికి ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం అయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. రెండోదఫా ఆయన ఎన్నికను ఎవరూ వ్యతిరేకించలేదని తెలిపింది. తదుపరి అధినేత ఎన్నిక కోసం విధించిన (సెప్టెంబర్‌ 23) గడువు ముగిసే నాటికి కొత్తగా ఎలాంటి నామినేషన్లు రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీంతో వచ్చే మేలో జరుగనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సమావేశాల్లో టెడ్రోస్‌ను రెండోసారి ఎన్నుకునే ప్రక్రియ జరగనున్నట్లు పేర్కొంది.

WHO డైరెక్టర్ జనరల్‌గా 2017లో బాధ్యతలు చేపట్టిన టెడ్రోస్ ఐదేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది మేలో ముగియనుంది. రెండోసారి ఆ పదవిలో కొనసాగేందుకు టెడ్రోస్‌ అధనామ్‌ పేరును జర్మనీ, ఫ్రాన్స్ సిఫారసు చేశాయి. ఐరోపా సమాఖ్యలోని మరో 15 దేశాలు కూడా మద్దతు ప్రకటించినట్లు సమాచారం. టెడ్రోస్ స్వదేశం ఇథియోపియా అయినప్పటికీ అక్కడి ప్రధానితో ఉన్న విభేదాల కారణంగా ఆయన పేరును.. ఆ దేశం నామినేట్ చేయలేదు. అయినప్పటికీ ఆయన ఎన్నికను ఇతరులెవ్వరూ వ్యతిరేకించకపోవడంతో రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమయ్యింది.

ఇథియోపియాకు చెందిన టెడ్రోస్‌ అధనామ్‌ డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి ఆఫ్రికన్‌గా నిలిచారు. అంతకుముందు ఇథియోపియాకు ఆరోగ్య, విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆయన.. యావత్‌ ప్రపంచాన్ని కొవిడ్‌ మమహమ్మారి వణికించిన వేళ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటువ్యాధులు, జీవశాస్త్ర నిపుణుడిగా పేరొందిన టెడ్రోస్‌ ప్రజారోగ్య విభాగంలో డాక్టరేట్‌ పొందారు. అయితే వైద్యుడు కాని వ్యక్తి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ పదవికి ఎన్నిక కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని