Covid: యూరప్‌లో కొవిడ్‌ విలయం.. మార్చి నాటికి మరో 7లక్షల మరణాలు!

కరోనా వైరస్‌ మహమ్మారి దాటికి యూరప్‌ దేశాలు విలవిలలాడుతున్నాయి. 53 దేశాలున్న యూరప్‌లో దాదాపు 49 దేశాల్లోని ఆస్పత్రులు తీవ్ర ఒత్తిడికి ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ యూరప్‌ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 24 Nov 2021 01:26 IST

ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్యసంస్థ

లండన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి దాటికి యూరప్‌ దేశాలు విలవిలలాడుతున్నాయి. 53 దేశాలున్న యూరప్‌లో దాదాపు 49 దేశాల్లోని ఆస్పత్రులు తీవ్ర ఒత్తిడికి ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ యూరప్‌ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం యూరప్‌ వ్యాప్తంగా ఇప్పటివరకు 15లక్షల మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోగా.. మార్చి నాటికి ఈ సంఖ్య 22లక్షలకు చేరవచ్చని అంచనా వేసింది. ఇలా కేవలం వచ్చే నాలుగు నెలల్లోనే యూరప్‌లో మరో 7 లక్షలు కొవిడ్‌ మరణాలు పెరగవచ్చన్న డబ్ల్యూహెచ్‌ఓ.. ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ తగ్గుతుందనేందుకు రుజువులు కూడా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

గత కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్‌ కేసులు, మరణాల్లో సగానికిపైగా యూరప్‌లోనే ఉంటున్నాయి. గతవారం రోజుల్లోనే 4200 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్‌ నెలతో పోలిస్తే కొవిడ్‌ మరణాలు రెట్టింపయ్యాయి. ఇలా ఇప్పటివరకు యూరప్‌ మొత్తంగా 15 లక్షల మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న నాలుగు నెలల్లోనే యూరప్‌లో మరో 7లక్షల మంది కొవిడ్‌ బారినపడి ప్రాణాలు కోల్పోనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా 25 దేశాల్లోని ఆస్పత్రులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోనున్నాయని పేర్కొంది. మార్చి 2022 నాటికి 49 దేశాల్లో కొవిడ్‌ అత్యవసర సేవల పడకలకు (ఐసీయూ) మరింత ఒత్తిడి పెరగనున్నట్లు తెలిపింది.

‘ప్రస్తుతం యూరప్‌తో సహా సెంట్రల్‌ ఆసియాలో కొవిడ్‌ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. రానున్న శీతాకాలంలో ఇవి సవాలుగా మారనున్నాయి. అయినప్పటికీ నిరాశ చెందకుండా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా కలసికట్టుగా ప్రయత్నం చేయాలి’ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ యూరప్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ క్లూగే పేర్కొన్నారు. వైరస్‌ కట్టడి చర్యలతోపాటు బూస్టర్‌ డోసుపైనా ఆయా దేశాలు దృష్టిపెట్టాలని సూచించారు. ముఖ్యంగా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారితో పాటు వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని