WHO: మహమ్మారి ప్రతాపం.. వారంలోనే 50 లక్షల కేసులు..!

గడిచిన వారంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 50లక్షల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.

Updated : 30 Dec 2021 19:55 IST

అప్రమత్తంగా ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

బెర్లిన్‌: ప్రపంచ దేశాలకు కొత్త వేరియంట్‌ వేగంగా విస్తరిస్తోన్న వేళ ఆయా దేశాల్లో కొవిడ్‌-19 ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఇలా డిసెంబర్‌ 20-26 తేదీల మధ్య ప్రపంచవ్యాప్తంగా సుమారు 50లక్షల కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసుల్లో 11శాతం పెరుగుదల కనిపించినట్లు పేర్కొంది. ముఖ్యంగా అమెరికాలో కేసులు భారీగా పెరగగా.. అక్కడ అక్టోబర్‌ నుంచే వైరస్‌ విజృంభణ మరోసారి మొదలైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా అమెరికా, ఐరోపా దేశాల్లో కనిపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గడిచిన వారంలో నమోదైన మొత్తం 49.9లక్షల కేసుల్లో 28లక్షల కేసులు కేవలం యూరప్‌లోనే ఉన్నాయి. అంతకుముందు వారంతో పోలిస్తే అక్కడి పాజిటివ్‌ కేసుల్లో 3శాతం పెరుగుదల కనిపించింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా యూరప్‌లోనే ఇన్‌ఫెక్షన్‌ రేటు అధికంగా ఉంది. ప్రతి లక్ష జనాభాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 304.6గా నమోదవుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది.

అటు అమెరికాలోనూ పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతున్నాయని.. గతవారంలోనే 14.8లక్షల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అంతకుముందు వారంతో పోలిస్తే 39శాతం పెరిగింది. అంతేకాకుండా యూరప్‌ తర్వాత అత్యధిక ఇన్‌ఫెక్షన్‌ రేటు అమెరికాలోనే ఉంది. ప్రస్తుతం ప్రతి లక్ష జనాభాలో 144.4 కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇక ఆఫ్రికాలో గతవారం 2 లక్షల 75వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా కొత్త కేసుల్లో 7శాతం పెరుగుదల కనిపించింది.

ముప్పు అధికమే..

తాజా పరిస్థితులను బట్టి చూస్తే కొత్త వేరియంట్‌ ముప్పు అధికంగానే ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎక్కువ ప్రాబల్యం డెల్టాదే ఉండగా.. తాజాగా దీన్ని మించి ఒమిక్రాన్‌ వ్యాపిస్తుందనడానికి ఆధారాలు అభిస్తున్నాయని స్పష్టం చేసింది. అయితే, దక్షిణాఫ్రికా, యూకే, డెన్మార్క్‌లనుంచి వస్తోన్న సమాచారాన్ని చూస్తే ఒమిక్రాన్‌తో ఆస్పత్రి బారినపడే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని చెప్పింది. అయినప్పటికీ ఆక్సిజన్, వెంటిలేషన్‌ అవసరాలతో పాటు మరణం ముప్పుకి సంబంధించి ప్రభావాలను అర్థం చేసుకునేందుకు మరింత సమాచారం అవసరముందని పేర్కొంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా గతవారంలో కొవిడ్‌ మరణాల సంఖ్య 4శాతం తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని