Antibody Treatment for Covid: యాంటీబాడీ చికిత్సకు WHO సిఫార్సు!

వైరస్‌ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లేదా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి యాంటీబాడీ చికిత్స అందిచ్చవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

Published : 24 Sep 2021 21:17 IST

కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ఇవ్వవచ్చన్న WHO

వాషింగ్టన్‌: కొవిడ్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. చికిత్సకు సంబంధించి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లేదా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి యాంటీబాడీ చికిత్స అందిచ్చవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. వీటికి సంబంధించిన తాజా మార్గదర్శకాలు ప్రముఖ జర్నల్‌ BMJలో ప్రచురితమయ్యాయి.

కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు యాంటీబాడీ చికిత్సపై డబ్ల్యూహెచ్‌ఓ గైడ్‌లైన్‌ డెవలప్‌మెంట్‌ గ్రూపు (GDG) కమిటీ పలు సిఫార్సులను చేసింది. కొవిడ్‌ తీవ్రత ఉండి ఆస్పత్రి బారినపడే ముప్పు ఉన్నవారితో పాటు.. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉండి యాంటీబాడీల ప్రతిస్పందన తక్కువగా ఉండేవారిపై అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు Casirivimab, Imdevimab ఇవ్వడం వల్ల ఆస్పత్రి చేరికలను తగ్గిస్తున్నట్లు గుర్తించింది. ముఖ్యంగా వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వెయ్యి మంది రోగుల్లో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్యను 49కి తగ్గిస్తుండగా.. ఆరోగ్య పరిస్థితి విషమించిన వారిలో ఈ సంఖ్యను 87కు పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. కాక్‌టెయిల్‌ రూపంలో అందించే ఈ విధానంలో మెరుగైన ఫలితాలు వస్తున్నందున వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఈ యాంటీబాడీ చికిత్స ఇవ్వవచ్చని సూచించింది.

కృత్రిమంగా వృద్ధి చేసిన కాసిరివిమాబ్‌, ఇమ్డెవిమాబ్‌లతో కూడిన మోనోక్లోనల్‌ యాంటీబాడీలను ఇవ్వడం వల్ల కణాలకు వైరస్‌ సోకకుండా తటస్థీకరించవచ్చు. ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే స్పైక్‌ ప్రొటీన్‌ను ఈ యాంటీబాడీలు కట్టడి చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. తద్వారా కొవిడ్‌ బాధితులు ఆస్పత్రి ముప్పు నుంచి బయటపడవచ్చని సూచించింది. వీటితో పాటు వ్యాధి తీవ్రతకు సంబంధం లేకుండా కొవిడ్‌ బాధితులకు ఐవర్‌మెక్టిన్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధాల వాడకాన్ని తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.

ఇక ఈ కాక్‌టెయిల్‌ యాంటీబాడీ చికిత్సను ఇప్పటికే భారత్‌లో అమలు చేస్తున్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ వేళ.. హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG)లోనూ 40మంది కొవిడ్‌ బాధితులకు ఈ చికిత్స అందించారు. ఇది తీసుకున్న బాధితులు తీవ్ర అనారోగ్యం నుంచి కొన్ని గంటల్లోనే కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

ఇదిలాఉంటే, భారత్‌లోనూ కొవిడ్‌ చికిత్స జాబితా నుంచి ఐవర్‌మెక్టిన్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లను తొలగిస్తున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి తాజాగా వెల్లడించింది. కొవిడ్‌ బాధితులకు ఉపశమనం కలిగిస్తున్నాయనడానికి ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. వీటికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలను సవరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని