WHO: కొత్త వేరియంట్‌ వేళ.. ఆ తప్పుడు భావన వీడండి..!

ఐరోపాతో సహా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా విజృంభణ, దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది.

Published : 26 Nov 2021 16:19 IST

టీకా తీసుకున్నా జాగ్రత్తలు పాటించాలని కోరిన ఆరోగ్య సంస్థ

జెనీవా: ఐరోపాతో సహా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా విజృంభణ, దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది. టీకా వేయించుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్ని దేశాలకు సూచించింది. ఈ మేరకు ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ట్వీట్ చేశారు. మహమ్మారి ముగిసిపోయిందని, టీకా పొందిన వారికి పూర్తి రక్షణ లభిస్తుందనే తప్పుడు భావన ప్రజల్లో నెలకొని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

‘మీరు కరోనా టీకా వేయించుకున్నప్పటికీ.. మీకు మీరే వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రమాదం పొంచి ఉన్న ఇతరులకు సోకకుండా జాగ్రత్తగా ఉండాలి. టీకాలు మహమ్మారిని పూర్తిగా అంతం చేశాయనే తప్పుడు భావన గురించి మేం ఆందోళన చెందుతున్నాం. అవి ప్రాణాలు కాపాడతాయి. కానీ.. వైరస్ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోవు. ఈ సమయంలో వైరస్ నుంచి రక్షణ పొందడానికి..

మాస్కులు ధరించండి.

భౌతిక దూరం పాటించండి.

రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండండి.

గాలి, వెలుతురు కోసం కిటీకీలు తెరిచి ఉంచండి’ అని టెడ్రోస్ ప్రజలను అభ్యర్థించారు.

కొత్త వేరియంట్‌పై ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం..

ఐరోపా, అమెరికా వంటి దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా కాస్త ఊరట వాతావరణమే కనిపిస్తోంది. డెల్టా సృష్టించిన విలయం నుంచి ఇప్పుడే పలు దేశాలు ఊపిరి పీల్చుంటుకున్నాయి. ఈ సమయంలో దక్షిణాఫ్రికాలో బయటపడ్డ బి.1.1.529 వేరియంట్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దానిలో అసాధారణ మ్యుటేషన్ల కారణంగా మునుపటి వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్నాయని, వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందన్న వార్తలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో ఈ కొత్త వేరియంట్‌పై నేడు ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం నిర్వహించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని