
Omicron: కొత్త వేరియంట్‌తో ఒక్క మరణం కూడా లేదు..కానీ!: WHO
జెనీవా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం హెచ్చరించింది. అయితే ఈ వేరియంట్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో, తీవ్రత ఏ మేరకు ఉంటుందో అనే దానిపై మాత్రం అనిశ్చితి నెలకొని ఉందని వెల్లడించింది. ఈ కొత్త రకం వెలుగుచూసిన కొద్ది రోజుల్లోనే వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
‘ఒమిక్రాన్ వేరియంట్‌తో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అయితే ఈరోజు వరకు ఈ కొత్త వేరియంట్ కారణంగా ఒక్క మరణం కూడా నమోదుకాలేదు’ అని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత వారం దక్షిణాఫ్రికాలో ఈ కరోనా కొత్త వేరియంట్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ వేరియంట్లోని అసాధారణ మ్యుటేషన్లపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. దానిని ఆందోళన కలిగించే వేరియంట్‌గా వర్గీకరించి.. ఒమిక్రాన్ అని నామకరణం చేసింది. ఇది ఇప్పటివరకు వెలుగు చూసిన ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లకంటే ప్రమాదకరమైన జాబితాలోకి చేర్చింది. ఈ జాబితాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ మాత్రమే ఉంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14 దేశాలకు పైగా ఒమిక్రాన్ వ్యాపించింది.