వైరల్‌ వీడియో: ‘ఉరి తీస్తా..’ ఉద్యోగులకు కలెకర్ట్‌ వార్నింగ్‌!

విధులు సరిగా నిర్వహించకుంటే ఉరితీస్తా నంటూ ఉగ్యోగులపై కలెక్టర్‌ మండిపడిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జిల్లాలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను సరిగా నిర్వహించడం లేదంటూ......

Updated : 16 Dec 2021 11:31 IST

గ్వాలియర్‌: విధులు సరిగా నిర్వహించకుంటే ఉరితీస్తానంటూ ఉగ్యోగులపై కలెక్టర్‌ మండిపడిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జిల్లాలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను సరిగా నిర్వహించడం లేదంటూ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లా కలెక్టర్‌ కౌశలేంద్ర విక్రమ్‌సింగ్‌ ప్రభుత్వ ఉద్యోగులపై మండిపడ్డారు. భితర్వార్‌ రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఓ సమావేశంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. వ్యాక్సినేషన్‌ లక్ష్యాలను అందుకోవడంలో విఫలమయ్యారని ఉద్యోగులపై విరుచుకుపడ్డారు.

‘వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకూడదు. అలా చేస్తే మిమ్మల్ని ఉరితీస్తా. టీకాలు తీసుకోకుండా ఎవరూ ఉండకూడదు. ప్రజల వద్దకు వెళ్లి అభ్యర్థించండి. పంట పొలాల వద్దకు వెళ్లండి. ప్రజల ముందు సాష్టాంగపడండి. రోజంతా వారి ఇళ్ల ముందు వేచిచూడండి. టీకా తీసుకునేందుకు వారిని ప్రోత్సహించండి. ఏదైనా చెయ్యండి.. వ్యాక్సినేషన్‌ మాత్రం పూర్తికావాలి’ అని పేర్కొన్నారు.

కలెక్టర్‌ వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై రిపోర్టర్లు ఆయనను ప్రశ్నించగా.. వ్యాక్సినేషన్‌ లక్ష్యాలను చేరుకోకపోతే సస్పెండ్‌ చేస్తానని, చర్యలు తీసుకుంటానని మాత్రమే తాను హెచ్చరించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్‌ చివరి నాటికి రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి టీకా అందిస్తామని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని