covid Vaccination: ఇలా పంపిణీ చేస్తే మరో ఏడాదే..!

ప్రస్తుతం వ్యాక్సిన్‌ సరఫరా రేటు ప్రకారం, దేశ రాజధానిలో లబ్ధిదారులందరికీ వ్యాక్సిన్‌ అందివ్వాలంటే మరో ఏడాది సమయం పడుతుందని దిల్లీ ప్రభుత్వం పేర్కొంది.

Published : 09 Aug 2021 01:05 IST

వ్యాక్సిన్‌ లభ్యతపై దిల్లీ ప్రభుత్వం అసంతృప్తి

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ కాస్త మందకొడిగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. మెగా డ్రైవ్‌ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం 30 నుంచి 50లక్షల డోసులు పంపిణీ చేస్తున్నారు. అయినప్పటికీ డిమాండ్‌కు సరిపడా వ్యాక్సిన్‌ డోసులు లేవని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా దిల్లీ ప్రభుత్వం కూడా వ్యాక్సిన్‌ కొరతపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్‌ సరఫరా రేటు ప్రకారం, దేశ రాజధానిలో లబ్ధిదారులందరికీ వ్యాక్సిన్‌ అందివ్వాలంటే మరో ఏడాది సమయం పడుతుందని పేర్కొంది.

దిల్లీలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ లబ్ధిదారుల సంఖ్య దాదాపు కోటీ 50 లక్షలమంది ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. వారందరికీ రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ అందిచాలంటే 3 కోట్ల డోసులు అవసరం. ఆగస్టు 5 నాటికి కేవలం కోటి డోసులను మాత్రమే పంపిణీ చేశారు. 76 లక్షలకు పైగా అనగా దాదాపు 50 శాతం మంది కనీసం ఒకడోసును తీసుకున్నారు. ఈ సమయంలో మరో రెండు కోట్ల డోసులు అవసరం అవుతాయని దిల్లీ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం పంపిణీ రేటు ప్రకారం, అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలంటే 2022 ఆగస్టు అవుతుందని పేర్కొంది. డిసెంబర్‌ నాటికే పూర్తి చేయాలంటే మాత్రం ప్రతినెలా 45 లక్షల డోసులను పంపిణీ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. కానీ, డిమాండ్‌కు సరిపడా వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉండడం లేదని అసంతృప్తి చేసింది.

ఇదిలా ఉంటే వ్యాక్సిన్‌ కొరత ఉందంటున్న చాలా రాష్ట్రాలు.. తమకు మరిన్ని డోసులు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. టీకా కొరతను ఖండిస్తున్న కేంద్రం.. సరిపడా డోసులు రాష్ట్రాల వద్ద ఉన్నాయని చెబుతోంది. ఇప్పటివరకు మొత్తం 50 కోట్ల 68 లక్షల డోసులు పంపిణీ చేశామని.. మరో రెండు/మూడు కోట్లు డోసులు రాష్ట్రాల వద్దే ఉన్నాయని పేర్కొంటోంది. ప్రతినెలా 11 నుంచి 13 కోట్ల డోసులు రాష్ట్రాలకు అందిస్తున్నామని చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని