Published : 19 Nov 2021 15:25 IST

Farm Laws: సాగు చట్టాల రద్దుతో భాజపాకు ప్రయోజనం ఉండదా?

సుప్రీంకోర్టు నిపుణుల కమిటీలోని సభ్యుడు ఏమన్నారంటే..

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేయడంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీలోని ఓ సభ్యుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. పైగా ఈ నిర్ణయంతో రైతుల ఆందోళనలు ఆగబోవన్నారు. అలాగే దీని వల్ల అధికార భాజపాకు రాజకీయంగానూ ఎటువంటి ప్రయోజనం ఉండబోదని వ్యాఖ్యానించారు.

వివాదాస్పద సాగు చట్టాల సంప్రదింపుల కోసం సర్వోన్నత న్యాయస్థానం గత జనవరిలో నిపుణుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ సభ్యుల్లో ఒకరైన షెట్కరీ సంఘటనా అధ్యక్షుడు అనిల్‌ జె ఘన్వాత్‌ నేడు స్పందించారు. నేడు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ ప్రకటనను ఓ రాజకీయ నిర్ణయంగా అభివర్ణించారు. చట్టాలను రద్దు చేయడానికి బదులు సర్కార్‌ ఇతర ప్రత్యామ్నాయాలను ఆశ్రయించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ చట్టాలపై ఉన్న అనుమానాలను పార్లమెంటులో బిల్లులపై చర్చ సందర్భంలోనే ప్రభుత్వం నివృత్తి చేసి ఉండాల్సిందన్నారు. కనీసం పార్లమెంటరీ ప్యానెల్‌కైనా పంపి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదన్నారు.

ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసినంత మాత్రాన రైతులు ఆందోళన విరమించే అవకాశం లేదన్నారు. అన్నదాతల ప్రధాన డిమాండ్‌ ‘కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)’కు చట్టబద్ధత కల్పించడమేనని తెలిపారు. అది నెరవేరే వరకు ఆందోళనలు ఆగే అవకాశం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భాజపాకు రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం చేకూర్చే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.

నూతన సాగు చట్టాల వల్ల రైతులకు పంట విక్రయం విషయంలో కొంత స్వేచ్ఛ లభించి ఉండేదని ఘన్వాత్‌ అన్నారు. కానీ, ఇప్పుడు ఆ అవకాశం కోల్పోయారన్నారు. బ్రిటీష్‌ కాలం నుంచి రైతులు ఎలా మోసపోయారో.. ఇకపై మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. రైతుల ఉద్యమం తారస్థాయిలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదన్నారు. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల్లో విజయం కోసమే సర్కార్‌ రైతుల డిమాండ్‌లకు తలొగ్గిందన్నారు. యూపీలో అధికారం నిలబెట్టుకోవడం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇది ఏమాత్రం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు.

వాస్తవానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆందోళనలను కొనసాగించాలని రైతులు నిర్ణయించారని ఘన్వాత్‌ అన్నారు. ఈ చట్టాల్లోని కొన్ని ప్రతిపాదనలను ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఏపీఎంసీ వెలుపల పంట ఉత్పత్తులను విక్రయించుకోవడానికి వీలు కల్పించే నిబంధన ఇప్పటికే 21 రాష్ట్రాల్లో అమలవుతోందని చెప్పారు.

కమిటీ సభ్యుల్లో ఒకరైన అశోక్‌ గులాటీ మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం చట్టాల్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఇది వారి ఇష్టం. మేం ఇప్పటికే సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాం. చట్టాలను రద్దు చేయాలా? వద్దా? అనే విషయంలో నివేదికను అనుసరించి న్యాయస్థానం ప్రభుత్వానికి సూచనలు చేసి ఉండేది. ఏదైమైనా రైతులకు ఇప్పుడు మంచే జరిగింది. ఇక వారు విశ్రాంతి తీసుకోవచ్చు. అయితే, రాబోయే ఎన్నికలే చట్టాల రద్దు వెనుక ప్రధాన కారణం’’ అని అన్నారు.

సాగు చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు, వివిధ వర్గాల ఆందోళనలతో సర్వోన్నత న్యాయస్థానం వాటి అమలును గత జనవరిలోనే తాత్కాలికంగా నిషేధించింది. అలాగే వీటిపై వివిధ రంగాలకు చెందిన వారితో సంప్రదింపులు జరిపేందుకు భారత సుప్రీకోర్టు జనవరిలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. వీరిలో ఒకరైన భూపీందర్‌ సింగ్‌ మాన్‌ కమిటీ నుంచి మొదట్లోనే తప్పుకున్నారు. మహారాష్ట్రకు చెందిన షెట్కరీ సంఘటనా అధ్యక్షుడు అనిల్‌ ఘన్వాత్‌తో పాటు వ్యవసాయరంగ ఆర్థికవేత్త అశోక్‌ గులాటీ, డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ జోషీలు దేశవ్యాప్తంగా రైతులు, వివిధ రంగాల నిపుణులతో పలు దఫాల్లో సంప్రదింపులు జరిపారు. ఇందుకోసం నేరుగా, ఆన్‌లైన్‌ సహాయంతో వివిధ వర్గాలతో భేటీ అయ్యారు. అనంతరం వీటిపై రూపొందించిన నివేదికను మార్చిలో సుప్రీం కోర్టుకు అందజేశారు. అయితే, దాన్ని ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts