Omicron: దేశంలో ఒమిక్రాన్‌ కలకలం.. మహారాష్ట్రలో ఒక్కరోజే 85 కేసులు

దేశంలో ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్రతో పాటు రాజస్థాన్‌, గుజరాత్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే.....

Updated : 29 Dec 2021 22:17 IST

దిల్లీ: దేశంలో ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్రతో పాటు రాజస్థాన్‌, గుజరాత్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 85 ఒమిక్రాన్‌ కేసులు రావడం కలకలం రేపుతోంది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 252కి పెరిగింది. తాజాగా వచ్చిన వాటిలో ముంబయిలోనే అత్యధికంగా 53 కేసులు నమోదు కావడం గమనార్హం. పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV) ల్యాబ్‌లో జీనోమ్‌ సీక్వెనింగ్‌లో 47 మందికి ఒమిక్రాన్‌ నిర్ధారణ కాగా.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి (IISER)లో జరిపిన పరీక్షల్లో మరో 38 మందికి కొత్త వేరియంట్‌ సోకినట్టు వైద్యులు వెల్లడించారు. IISER నివేదికల్లో పాజిటివ్‌గా తేలిన 38 మందికీ అంతర్జాతీయంగా ఎలాంటి  ట్రావెల్‌ హిస్టరీ లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. పుణె ల్యాబ్‌ నుంచి వచ్చిన నివేదికలకు సంబంధించిన 47 మంది బాధితుల్లో 43 మంది అంతర్జాతీయ ప్రయాణికులు కాగా.. నలుగురు కాంటాక్టులకు ఒమిక్రాన్‌ సోకిందని తెలిపారు.

రాజస్థాన్‌లో 23.. గుజరాత్‌లో 19.. 

మరోవైపు, రాజస్థాన్‌లో 23 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క అజ్మేర్‌ నుంచే 10 కేసులు రాగా.. రాజధాని జైపుర్‌ నుంచి 9 కేసులు వచ్చాయని వైద్యాధికారులు వెల్లడించారు. ఇద్దరు భిల్వాడా నుంచి, అల్వార్‌, జోధ్‌పుర్‌ నుంచి ఒకరు చొప్పున ఉన్నట్లు తెలిపారు. రాజస్థాన్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (RUHS) ఆసుపత్రిలో వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. దీంతో రాజస్థాన్‌లో తాజా వేరియంట్‌ కేసుల సంఖ్య 69కి చేరింది. గుజరాత్‌లో బుధవారం మరో 19 మందికి ఒమిక్రాన్‌గా నిర్ధరణ అయినట్లు అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు. ఎవరిలోనూ తీవ్ర లక్షణాలు లేవని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని