UK Woman: కోమా నుంచి బయటకు వచ్చి.. పక్కన బిడ్డను చూసి ఆశ్చర్యపోయింది!

ఊహించనిది జరగడమే జీవితమని మనం వింటుంటాం. ఈ పదం బ్రిటన్‌లోని మాంచెస్టర్‌కి చెందిన లారా వార్డ్‌(33)కు అతికినట్టు సరిపోతుంది.

Published : 15 Dec 2021 01:35 IST

లండన్‌: ఊహించనిది జరగడమే జీవితమని మనం వింటుంటాం. ఈ పదం బ్రిటన్‌లోని మాంచెస్టర్‌కి చెందిన లారా వార్డ్‌(33)కు అతికినట్టు సరిపోతుంది. గర్భంతో ఉన్నప్పుడు కరోనా కారణంగా కోమాలోకి వెళ్లిన ఆ మహిళ.. కోమా నుంచి బయటకు వచ్చేసరికి పక్కనే బిడ్డ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. మహమ్మారి కారణంగా ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవడంతో.. 31వ వారంలో ఆపరేషన్ చేసి, వైద్యులు బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. కోమాలో ఉండటంతో ఈ విషయం ఆమెకు గుర్తులేదు..!

లారా వార్డ్ స్కూల్ టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండేవారు. పాఠశాల వేసవి సెలవుల్లో ఆమెకు దగ్గు రావడం ప్రారంభమైంది. లక్షణాలు తీవ్రం కావడంతో పరీక్ష చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌ అని తేలింది. అప్పటికే ఆమె గర్భం దాల్చారు. వైరస్ కారణంగా ఆమెకు శ్వాస సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకున్నప్పటికీ.. పరిస్థితి మరింత దిగజారింది. వాస్తవంగా లారా ప్రసవ సమయం అక్టోబర్‌లో అయినా.. ఆమె పరిస్థితి దిగజారడంతో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సిన పరిస్థితి ఎదురైంది. కొవిడ్ ఆంక్షల కారణంగా భర్తకు అనుమతి లేకపోవడంతో.. లారానే సీ సెక్షన్‌కు అనుమతి ఇచ్చినట్లు సిబ్బంది తెలిపారు. కానీ లారాకు మాత్రం ఇదంతా ఏం గుర్తులేదు. ఆమెకు కొవిడ్ వార్డుకు వచ్చిన విషయం మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. ఏడు వారాల తర్వాత కళ్లు తెరిచి చూడగా.. పక్కనే ఉన్న బిడ్డను చూసి, ఆశ్చర్యపోయింది. ఆపరేషన్‌కు అంగీకరించిన విషయం, బిడ్డకు జన్మనిచ్చిన విషయం ఏదీ ఆమెకు గుర్తుకు లేదు. ప్రస్తుతానికి ఆమె కోమా నుంచి బయటకు వచ్చినప్పటికీ.. పూర్తి స్థాయిలో కోలుకోవాల్సి ఉంది. ‘నా పక్కనే ఉన్న బిడ్డను చూసేందుకు నేను కళ్లు తెరిచాను. కానీ నా శరీరాన్ని కొంచెం కూడా కదల్చలేకపోయాను. తల మాత్రమే ఆడించగలుగుతున్నాను’ అని లారాను ఉద్దేశించి ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఇప్పుడిప్పుడే కాస్త నడవగలుగుతుందని ఆమె గురించి పేర్కొంది. ఇదిలా ఉండగా.. పుట్టిన ఆ బిడ్డ పేరు హోప్‌ అని పెట్టుకుంది ఆ కుటుంబం. నెలలు నిండకుండానే జన్మించిన ఆ చిన్నారి.. ఇప్పుడు కోలుకొని ఆరోగ్యంగా ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు