UN Warning: అగాధం అంచుల్లో ప్రపంచం.. మేల్కొనాల్సిందే!

యావత్‌ ప్రపంచం అగాధం అంచులో ఉందని.. ఇలాంటి సంక్షోభ సమయంలో మేల్కొనాల్సిందేనని ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సర్వసభ్య సమావేశాల ప్రారంభోపన్యాసం సందర్భంగా ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు.

Published : 22 Sep 2021 02:22 IST

ప్రపంచ దేశాలకు ఐరాస చీఫ్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌: ఇదివరకు ఎన్నడూ చవిచూడని విధంగా యావత్‌ ప్రపంచం విపరీత సంక్షోభాలను ఎదుర్కొంటోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారి విజృంభణ, ముంచుకొస్తున్న వాతావరణ సంక్షోభం, అఫ్గానిస్థాన్‌ నుంచి ఇథియోపియా వరకు ఉద్రిక్త పరిస్థితులతోపాటు ఇతర దేశాల్లో శాంతికి విఘాతం కలిగిస్తున్న తిరుగుబాటు వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. ఈ తరహా ఉపద్రవాన్ని లేదా విభజనను ప్రపంచం ఇంతకుముందెన్నడూ చూడలేదని అభిప్రాయపడింది. ఇలాంటి సంక్షోభ సమయంలో యావత్‌ ప్రపంచం మేల్కొనాల్సిందేనని ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సర్వసభ్య సమావేశాల ప్రారంభోపన్యాసం సందర్భంగా ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు.

‘నేను ఇక్కడ నుంచి ఓ హెచ్చరిక చేస్తున్నాను. యావత్ ప్రపంచం మేల్కొనాలి. ప్రస్తుతం మనం అగాధం అంచులో ఉన్నాం. అంతేకాకుండా తప్పు మార్గంలో ముందుకెళ్తున్నాం. ప్రపంచం ఇంతకుముందు ఎన్నడూ ఇంతటి ప్రమాదంలో పడలేదు. లేదా ఇంతగా విభజించబడ లేదు. మన జీవితకాలంలోనే అత్యంత ప్రమాదకరమైన సంక్షోభాలను ఎదుర్కొంటున్నాం’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ప్రపంచానికి అత్యంత అవసరం ఏర్పడిన సమయంలోనూ వివిధ దేశాల సంఘీభావం, కార్యాచరణ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

‘మానవ హక్కులు మంటల్లో కలిసిపోతున్నాయ్‌. సైన్స్‌పై దాడి జరుగుతోంది. ప్రమాదపు అంచుల్లో ఉన్నవారి ఆర్థిక జీవనం మరింత క్షీణిస్తోంది. అఫ్గానిస్థాన్‌ నుంచి ఇథియోపియా, అక్కడనుంచి యెమెన్‌ మరకు శాంతికి విఘాతం కలిగించే ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటికితోడు అపనమ్మకం, అసత్య సమాచారం ప్రజల్లో మరింత విభజనకు కారణమవుతున్నాయి’ అని ఐరాస చీఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 46లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరులోనూ ఇదే ధోరణి కనిపిస్తోందన్నారు. వ్యాక్సిన్‌ లభ్యతలో దేశాల మధ్య స్పష్టమైన అసమానతలను కొవిడ్‌ బహిర్గతం చేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 570 కోట్ల డోసులను పంపిణీ చేసినప్పటికీ ఆఫ్రికాలో కేవలం 2శాతం మందికే వ్యాక్సిన్‌ అందిన విషయాన్ని గుర్తుచేశారు. దాదాపు 90శాతం మంది ఆఫ్రికన్లు తొలి డోసు కోసమే నిరీక్షిస్తున్న విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని ఆంటోనియో గుటెరస్‌ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, కొవిడ్‌ కారణంగా ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశాలు గతేడాది వర్చువల్‌గానే జరిగినప్పటికీ ఈ ఏడాది మాత్రం నేరుగా జరుగుతున్నాయి. 193 దేశాలు ప్రాతినిధ్యం ఉన్న ఈ సమావేశాల్లో ఈసారి 100కుపైగా దేశాల ప్రతినిధులు వ్యక్తిగతంగా పాల్గొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని