Updated : 02/12/2021 15:35 IST

B.1.1.529 Variant: కొత్త వేరియంట్‌తో ప్రపంచ దేశాల్లో కలవరం!

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుతోందని భావిస్తున్న సమయంలోనే దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మరోసారి వైరస్‌ విజృంభణతో సతమతమవుతున్న యూరప్‌ దేశాలతో పాటు వైరస్‌ను సమర్థంగా కట్టడి చేస్తున్న దేశాలు కూడా కలవరపడుతున్నాయి. మరోవైపు కొత్తవేరియంట్‌ భయంతో ఆసియా, యూరప్‌, అమెరికా స్టాక్‌ మార్కెట్లు కూడా ఒడుదొడుకులకు గురికావడం స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే విస్తృత వ్యాప్తిలో ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్‌ (B.1.1.529) అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలను కొవిడ్‌ భయాలు మరోసారి వెంటాడుతున్నాయి.

కలవరపడుతోన్న దేశాలు..: కొవిడ్‌ విలయంతో మరోసారి అల్లాడిపోతున్న యూరప్‌ దేశాలు.. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌తో తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే విస్తృతంగా వ్యాప్తిస్తున్న కొవిడ్‌ మహమ్మారిని కట్టడి చేయలేకపోతున్న ఈయూ దేశాలకు కొత్త వేరియంట్‌ మరింత సమస్యగా మారనుందని జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్‌ స్పాన్‌ పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌ కంటే విస్తృత వ్యాప్తి కలిగి ఉండడంతో పాటు దీనిపై ప్రస్తుతమున్న వ్యాక్సిన్‌లు తక్కువ సమర్థత కలిగివున్నట్లు తెలుస్తోందని బ్రిటిష్‌ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్‌ వాజిద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే సాధ్యమైనంత తొందరగా దీనిపై చర్యలకు ఉపక్రమించాలని అక్కడి చట్టసభ సభ్యులకు సూచించారు. ఇప్పటికే ఈ వేరియంట్‌కు సంబంధించి దక్షిణాఫ్రికాలో 22 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇజ్రాయెల్‌లోనూ తొలి కేసు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే ముందున్న ఇజ్రాయెల్‌ తాజాగా కొత్త వేరియంట్‌తోనూ కలవరపడుతోంది. మాలావి నుంచి ఒక వ్యక్తిలో ఈ వేరియంట్‌ వెలుగు చూడగా అనుమానిత లక్షణాలున్న మరో ఇద్దరిని ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షిస్తోంది.

ప్రయాణ ఆంక్షలకు సిద్ధం: కొత్త వేరియంట్‌తో అప్రమత్తమవుతున్న దేశాలు, ముందుజాగ్రత్తగా ప్రయాణ ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. దక్షిణాఫ్రికాతోపాటు మరో ఐదు దేశాలనుంచి వచ్చే విమానాలను నిషేధిస్తున్నట్లు బ్రిటన్‌ ఇప్పటికే ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని పేర్కొంది. ఇదే దారిలో పయణించేందుకు జర్మనీ కూడా సిద్ధమైంది. దక్షిణాఫ్రికా నుంచి కేవలం తమ పౌరులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఇటలీ కూడా ఆఫ్రికాలోని ఏడు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించింది. నెదర్లాండ్‌ కూడా ఇలాంటి ఆంక్షలను అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇక దక్షిణాఫ్రికాతో పాటు పలు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు పదిరోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని జపాన్‌ ఆదేశించింది. వీరికి మూడు, ఆరు, పదో రోజు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా కూడా ప్రయాణికులకు మళ్లీ కఠిన క్వారెంటైన్‌ నిబంధనలు అమలు చేసే పనిలో పడింది. ఇటు భారత్‌ కూడా కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలను హెచ్చరించింది.

స్టాక్‌ మార్కెట్లు కుదేలు: కేవలం ఆయా దేశాలనే కాకుండా యూరప్‌, ఆసియాతో పాటు అమెరికా స్టాక్‌ మార్కెట్లను కూడా కొత్త వేరియంట్‌ వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్‌ భయాలతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరోవైపు ఈ వేరియంట్‌ ధాటికి ఎయిర్‌లైన్స్‌ షేర్లు కుదేలయ్యాయి. లుఫ్తాన్సా 12.4శాతం, బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఐఏజీ, ఐబీరియా షేర్లు 14.4 శాతం పడిపోయాయి. వీటితోపాటు ఎయిర్‌ ఫ్రాన్స్‌-కేఎల్‌ఎం షేర్లు 8.9శాతం తగ్గిపోగా ఈజీజెట్‌ షేర్లు 10.9 శాతం తగ్గిపోయాయి. భారత్‌లోనూ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాటలో పయనించాయి. శుక్రవారం ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైంది.

తొందరపడొద్దు: WHO: అయితే, కొత్త వేరియంట్‌తో ప్రపంచ దేశాలు కలవరపడుతున్న నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేడు భేటీ అయ్యింది. ముఖ్యంగా ఆఫ్రికాలోని పలు దేశాలనుంచి ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నట్లు ఈయూ పేర్కొనడంపై స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పుడే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. గతంలోనూ కొత్త వేరియంట్‌లు వెలుగు చూసిన వెంటనే అత్యవసరంగా సరిహద్దులు మూసివేసి, ప్రయాణాలపై ఆంక్షలు విధించామని గుర్తుచేసింది. ఇలా తొందరపడి నిర్ధారణకు వచ్చి నిర్ణయాలు తీసుకోకుండా.. పరిస్థితులపై మాత్రం ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగాధిపతి మైక్‌ రేయాన్‌ స్పష్టం చేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని