Costly Divorces: చరిత్రలో నిలిచినఖరీదైన విడాకులు..!

కొందరు ప్రముఖులు విడాకుల సమయంలో ఇచ్చిపుచ్చుకొన్న ఆర్థిక వ్యవహారాలు చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలుస్తున్నాయి.

Published : 23 Dec 2021 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లంటే నూరేళ్ల పంట. అంటువంటి వివాహాన్ని స్థోమతను బట్టి కొందరు అట్టహాసంగా జరుపుకొంటారు. అలా కొన్ని అత్యంత ఖరీదైన వివాహాలుగా నిలుస్తుంటాయి. అయితే, కేవలం పెళ్లిళ్లే కాదు.. దంపతుల మధ్య విడాకులు కూడా ఈ మధ్య ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఎంతగా అంటే.. ప్రపంచమంతా మాట్లాడుకునేంత! విడాకుల సమయంలో ఇచ్చే భరణం గురించి పత్రికల్లో పతాక శీర్షికలయ్యేంత!! అలా కొందరు ప్రముఖులు విడాకుల సమయంలో ఇచ్చిపుచ్చుకొన్న ఆర్థిక వ్యవహారాలు చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలుస్తున్నాయి. అటువంటివి కొన్నింటిని చూద్దాం..


జెఫ్‌ బెజోస్‌-మెకంజీ స్కాట్‌

2018, 2019లో ప్రపంచ కుబేరుడిగా రికార్డుకెక్కిన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ - మెకంజీ స్కాట్‌ల విడాకుల వ్యవహారం అత్యంత ఖరీదైనదిగా చరిత్ర సృష్టించింది. పాతికేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ వారిద్దరూ 2019 చివర్లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో భరణం కింద స్కాట్‌కు అమెజాన్‌లో 4శాతం వాటా లభించింది. మొత్తంగా బెజోస్‌ నుంచి స్కాట్‌కు 38 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.2.80లక్షల కోట్లు) లభించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణ సమయంలో లాక్‌డౌన్‌లు విధించడం, ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు పెరగడంతో అమెజాన్‌ షేర్ల విలువ భారీగా పెరిగింది. దీంతో మెకంజీ సంపద కూడా పెరిగినట్లు సమాచారం. బెజోస్‌ నుంచి విడాకులు తీసుకున్న కొంతకాలానికి మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు మెకంజీ ఇటీవలే ప్రకటించారు.


బిల్‌గేట్స్‌-మిలిందా విడాకులు..

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌, మెలిందాతో ఉన్న 27ఏళ్ల వివాహ బంధానికి ఈ ఏడాది మే నెలలో ముగింపు పలికిన విషయం తెలిసిందే. ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఆ జంట.. సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం చివరకు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, వారిద్దరి సంపద విలువ అప్పట్లో 130 బిలియన్ డాలర్లుగా పలు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. విడాకుల నేపథ్యంలో ఆస్తుల పంపకం గురించి అధికారిక ప్రకటన రానప్పటికీ ఖరీదైన విడాకుల జాబితాలో వీరు చేరుతారనే వార్తలు వచ్చాయి. అయితే, తాము విడిపోయినా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాల్లో ఇరువురి భాగస్వామ్యం ఎప్పటిలాగే కొనసాగుతుందని బిల్‌గేట్స్‌-మెలిందా ఓ ఉమ్మడి ప్రకటన చేయడం విశేషం.


దుబాయ్‌ రాజు షేక్‌ మహమ్మద్..

దుబాయ్‌ రాజు షేక్‌ మహమ్మద్ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూం, జోర్డాన్‌ రాకుమారి హయా బింత్‌ అల్‌ హుసేన్‌ల విడాకుల వ్యవహారంపై ఇటీవలే బ్రిటన్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. భరణంలో భాగంగా హయా బింత్‌తోపాటు వారి పిల్లలకు కలిపి దాదాపు రూ.5,555 కోట్లు (550 మిలియన్‌ పౌండ్లు) చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తంలో రూ.2,521 కోట్లు మాజీ భార్యకు మూడు నెలల్లోపు చెల్లించాలి. మరో రూ.2,907 కోట్లు వీరిద్దరి పిల్లలైన అల్‌ జలీలా, జయేద్‌లకు బ్యాంకు గ్యారంటీతో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో బ్రిటిష్‌ చరిత్రలో అత్యధిక ఖరీదైన విడాకుల సర్దుబాటు వ్యవహారంగా దుబాయ్‌ రాజు విడాకులను చెబుతున్నారు.


రూపెర్ట్‌ మర్దోక్‌ - అన్నా మన్‌

ఆస్ట్రేలియన్‌-అమెరికన్‌ వ్యాపారవేత్త, మీడియా మొఘల్‌గా పేరుగాంచిన రూపెర్ట్‌ మర్దోక్‌, అన్నా మరియా మన్‌ 1999లో విడాకులు తీసుకున్నారు. 32 ఏళ్ల వివాహ అనుబంధం తర్వాత వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో అన్నా మన్‌కు భరణం రూపంలో రూపెర్ట్‌ భారీ మొత్తం చెల్లించారు. దాదాపు 1.7 బిలియన్‌ డాలర్ల ఆస్తి అందజేసినట్లు సమాచారం. అందులో 110 మిలియన్‌ డాలర్లను నగదు రూపంలో ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.


మెల్‌ గిబ్సన్‌ - రాబిన్‌ మూరే

ప్రముఖ అమెరికన్‌ నటుడు, దర్శకనిర్మాత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత మెల్‌ గిబ్సన్‌ - రాబిన్‌ మూరే దంపతుల విడాకులు కూడా ఖరీదైనవిగా రికార్డుకెక్కాయి. 31ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2011లో వారు విడాకులు తీసుకున్నారు. రాబిన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న మెల్‌ గిబ్సన్‌ సంపద అప్పట్లో 850 మిలియన్‌ డాలర్లుగా అంచనా. విడాకుల చెల్లింపులకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ రాబిన్‌ మూరేకు దాదాపు 425 మిలియన్‌ డాలర్లను గిబ్సన్‌ చెల్లించినట్లు వార్తలు వచ్చాయి.

* ఇక ఫ్రెంచ్‌ అమెరికన్‌ అలెక్‌ విల్డెన్‌స్టీన్‌ - జోస్లిన్‌ విడాకుల వ్యవహారం కూడా ఖరీదైనదిగా నిలిచింది. 21ఏళ్ల వివాహ బంధం తర్వాత 1999లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో జోస్లిన్‌కు అలెక్‌ విల్డెన్‌స్టీన్‌ 3.8 బిలియన్‌ డాలర్లను చెల్లించినట్లు సమాచారం.

బ్రిటన్‌ వ్యాపారవేత్త, ఫార్ములా వన్‌ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బెర్నీ ఎలెస్టోన్‌ - ప్రముఖ మోడల్‌ స్లవికాలు 2009లో విడాకులు తీసుకోగా.. వారిద్దరి మధ్య 1.2 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

అమెరికా వ్యాపారవేత్త స్టీవ్‌ వీన్‌ విడాకుల సమయంలో ఆయన మాజీ భార్యకు దాదాపు 1 బిలియన్‌ డాలర్లను చెల్లించారు.

హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌-ఎమీ 1989లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో 100 మిలియన్‌ డాలర్లను స్పీల్‌బర్గ్‌ చెల్లించినట్లు వార్తలు వచ్చాయి.

బాస్కెట్‌బాల్‌ లెజెండ్‌ మైఖేల్‌ జోర్దాన్‌, అమెరికా మాజీ మోడల్‌ జనైటా వనోయ్‌ విడాకులు కూడా ఖరీదైనవిగా నిలిచాయి. వీరే కాకుండా ఎంతోమంది ప్రముఖుల విడాకులు ఖరీదైనవిగా చరిత్రలో నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని