World's Smallest Baby: 13 నెలలకు ఇంటికి చేరిన ‘యాపిల్’ బేబీ

తల్లి గర్భం నుంచి 25 వారాలకే భూమ్మీదకొచ్చిన ఆ చిన్నారి బరువు 212 గ్రాములే. అది ఒక యాపిల్ బరువంత. పొడవు కేవలం 24 సెంటీమీటర్లు. అంత ‘చిన్న’ పాప ప్రాణం నిలపడం, ఈ పరిస్థితులకు తట్టుకునేలా చూసుకోవడం వైద్యులకు సవాలు మారిన క్షణమది. గతేడాది జూన్ నుంచి 13 నెలలుగా ఆ చిన్నారి ‘యాపిల్‌’ను కంటికి రెప్పలా కాచారు. ఎదిగిన ఆ పాపను ఇటీవలే ఇంటికి పంపారు. ఆ పాప పుట్టుక నుంచి ఇంటికి వెళ్లిన క్రమాన్ని సింగపూర్‌కు చెందిన నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ ఫేస్‌బుక్‌లో వెల్లడించింది. 

Updated : 09 Aug 2021 17:00 IST

సింగపూర్‌: తల్లి గర్భం నుంచి 25 వారాలకే భూమ్మీదకొచ్చిన ఆ చిన్నారి బరువు 212 గ్రాములే. అది ఒక యాపిల్ బరువంత. పొడవు కేవలం 24 సెంటీమీటర్లు. అంత ‘చిన్న’ పాప ప్రాణం నిలపడం, ఈ పరిస్థితులకు తట్టుకునేలా చూసుకోవడం వైద్యులకు సవాలు మారిన క్షణమది. గతేడాది జూన్ నుంచి 13 నెలలుగా ఆ చిన్నారి ‘యాపిల్‌’ను కంటికి రెప్పలా కాచారు. ఎదిగిన ఆ పాపను ఇటీవలే ఇంటికి పంపారు. ఆ పాప పుట్టుక నుంచి ఇంటికి వెళ్లిన క్రమాన్ని సింగపూర్‌కు చెందిన నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ ఫేస్‌బుక్‌లో వెల్లడించింది. 

గత ఏడాది జూన్‌ 9న సింగపూర్‌లోని నేషనల్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌ (ఎన్‌యూహెచ్)లో క్వెక్‌ యూ గ్జాన్‌ జన్మించింది. నెలలు నిండకముందే 25 వారాలకే ఈ భూమ్మీదకు వచ్చింది. అప్పుడు ఆ శిశువు బరువు 212 గ్రాములు మాత్రమే ఉంది. అది ఒక యాపిల్ బరువంత. తర్వాత చికిత్స నిమిత్తం ఆ బిడ్డను నియోనాటల్ కేంద్రానికి తరలించారు. ఆ శిశువును చూసి, అక్కడి నర్స్‌ ఆశ్చర్యపోయారు. తనను కళ్లను తానే నమ్మలేకపోయానని చెప్పారు. ‘నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. వెంటనే మా ప్రొఫెసర్‌కు ఈ విషయం చెప్పడానికి పరిగెత్తాను. నా 22 సంవత్సరాల వృత్తి జీవితంలో అంత చిన్నగా ఉన్న శిశువును చూడలేదు’ అంటూ ఆ నర్సు మీడియాకు వెల్లడించారు.

గత జూన్‌ నుంచి 13 నెలల పాటు క్వెక్‌కు చికిత్స అందించగా.. అందులో కొన్ని వారాల పాటు వెంటిలేటర్‌పైనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ చిన్నారి 6.3 కేజీలకు చేరుకుంది. అయితే ఈ క్రమంలో వైద్యులు చికిత్స అందించేప్పుడు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆమె పుట్టినప్పుడు కనీసం 400 నుంచి 600 గ్రాములవరకు ఉంటుందని వైద్యులు భావించారు. కానీ బరువు తక్కువగా పుట్టడంతో ఆమె సైజ్‌కు తగ్గట్టుగా అన్నింటినీ తగ్గించాల్సి వచ్చింది. ఆమెకు కృత్రిమ శ్వాస అందించడం కోసం ట్యూబ్,  మందుల పరిమాణం తగ్గించారు. డైపర్లను కత్తిరించాల్సి వచ్చింది. ఆమె చర్మం పెళుసుగా ఉండటంతో చికిత్స సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చేది. వీటన్నింటి మధ్య క్లిష్ట పరిస్థితుల్ని తట్టుకొని ఆ శిశువు ఎదగడం చూసి, తమ కష్టమంతా మర్చిపోయామన్నారు. ఈ కరోనా వేళ ఆమె ఒక ఆశాకిరణంలా  నిలిచిందని ఆసుపత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే ప్రపంచంలోనే అతి తక్కువ బరువుతో నెలలు నిండకముందే జన్మించి, జీవించి ఉన్న పాప ఈమేనని వైద్యులు భావిస్తున్నారు. ఇంతకు ముందు 2018లో అమెరికాలో జన్మించిన బేబీ బరువు 245 గ్రాములు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతానికి చిన్నారి ఇంటికి చేరినప్పటికీ, ఇంకా వైద్యం కొనసాగించాల్సి ఉంది. అందుకు తగ్గట్టుగా ఆమె తల్లిదండ్రుల్ని వైద్యులు సిద్ధం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని