Covid Origin: వుహాన్‌ ల్యాబ్‌ లీక్‌ అవకాశాలే ఎక్కువ..!

వుహాన్‌ ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కెనడా నిపుణురాలు స్పష్టం చేశారు.

Updated : 17 Dec 2021 15:36 IST

బ్రిటన్‌ ఎంపీల కమిటీ ముందు హార్వర్డ్‌ నిపుణురాలి నివేదిక

లండన్‌: రెండేళ్లుగా యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌-19కు కారణమైన సార్స్‌-కోవ్‌-2 మూలాలపై ఇంకా స్పష్టత రాలేదు. జంతువుల నుంచి మానవులకు సోకవచ్చనే అభిప్రాయంతో పాటు వుహాన్‌ ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యిందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తాజాగా ల్యాబ్‌లీక్‌పై అనుమానాలను వ్యక్తం చేసిన కెనడా నిపుణులు.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మరోసారి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కొవిడ్‌ మూలాలపై బ్రిటన్‌ చట్టసభ వేసిన ఓ కమిటీ ముందుంచిన ఓ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది.

కొవిడ్‌-19 చైనాలో జన్యుపరంగా సృష్టించిందేనని హార్వర్డ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ అలీనా ఛాన్‌ పేర్కొన్నారు. జీన్‌ థెరపీలో ప్రావీణ్యం కలిగిన ఆమె.. ‘వైరల్‌: ది రీసెర్చ్‌ ఫర్‌ ది ఆరిజిన్‌ ఆఫ్‌ కొవిడ్‌-19’ పేరుతో ఓ నివేదిక రూపొందించారు. దీనిని కొవిడ్‌ మూలాలపై బ్రిటన్‌ చట్టసభ ఏర్పాటు చేసిన ఓ కమిటీ ఎదుట ఈ నివేదికలోని అంశాలను వెల్లడించారు. ఈ వైరస్‌ ల్యాబ్‌ నుంచే లీక్‌ అయ్యిందని చెప్పడానికి ఆధారాలేంటని ఎంపీల బృందం అడిగిన ప్రశ్నలకూ డాక్టర్‌ అలీనా ఛాన్‌ వివరణ ఇచ్చారు. వుహాన్‌లో వైరస్‌ వెలుగు చూసిన విషయాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ కప్పిపుచ్చిందన్న ఆమె.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం దర్యాప్తును అడ్డుకునేందుకు చైనా అధికారులు చేసిన ప్రయత్నాలు ల్యాబ్‌ లీక్‌ థియరీని నమ్మేట్లు చేశాయని అన్నారు. అంతేకాకుండా, వుహాన్‌ మార్కెట్‌లో సహజంగా జంతువుల నుంచే ఈ వైరస్‌ సోకిందనడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని గుర్తుచేశారు.

ఇక లీక్‌ అయ్యే ముందు ఈ వైరస్‌లో ఏమైనా మార్పులు చేశారా? అనే ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ఇప్పటివరకు ఎంతో మంది ప్రముఖ వైరాలజిస్టులు జన్యుపరంగా సృష్టించిందేననే అభిప్రాయాలు వ్యక్తం చేశారని అన్నారు. తొలిసారి సార్స్‌ (SARS) వైరస్‌కు మార్పులు చేసిన నిపుణులే ఈ విషయాలు వెల్లడించారని డాక్టర్‌ అలీనా స్పష్టం చేశారు. అయితే, ‘‘కొవిడ్ మూలాల గురించి తెలిసిన వ్యక్తుల వివరాలు బహిర్గతం కావడం అంత సురక్షితం కాదు. దీని మూలాల గురించి తెలుసుకొనేందుకు ఐదేళ్లు లేదా మరో 50ఏళ్లైనా పట్టవచ్చు. అయితే, మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంత డేటా అయినా సేకరించి భద్రపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక క్రమపద్దతిలో నమ్మకంగా దర్యాప్తు చేయడమే చాలా అవసరం’’ అని హార్వర్డ్‌ నిపుణురాలు డాక్టర్‌ అలీనా ఛాన్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని