Omicron: డెల్టాతో పోలిస్తే రీ-ఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌కి వేగంగా వ్యాపించే గుణం అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉండవచ్చని ఇప్పటివరకు భావిస్తున్నారు. కానీ, అలా చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

Updated : 21 Dec 2021 11:13 IST

బ్రిటన్‌ పరిశోధకుల తాజా అధ్యయనం

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌కి వేగంగా వ్యాపించే గుణం అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉండవచ్చని ఇప్పటివరకు భావిస్తున్నారు. కానీ, అలా చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. డెల్టా వేరియంట్‌ కంటే తక్కువ తీవ్రత ఒమిక్రాన్‌కు ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి రుజువులు లేవని బ్రిటన్‌ అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా ఇదివరకు ఇన్‌ఫెక్షన్‌ వల్ల లేదా రెండు డోసుల వల్ల పొందిన రక్షణ నుంచి తప్పించుకునే సామర్థ్యం కూడా ఒమిక్రాన్‌కు ఉన్నట్లు వెల్లడించింది.

రీ ఇన్‌ఫెక్షన్‌ ముప్పూ అధికమే..

కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌తో బ్రిటన్‌ వణికిపోతోంది. ఇదే సమయంలో కొత్తవేరియంట్‌ తీవ్రత, ప్రభావాలను అంచనా వేసేందుకు లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. డెల్టాతో పోలిస్తే ఈ వేరియంట్ వల్ల రీ ఇన్‌ఫెక్షన్‌ బారినపడే ప్రమాదం 5.4రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా గతంలో ఇన్‌ఫెక్షన్‌ నుంచి పొందిన రక్షణను 19శాతం తగ్గిస్తున్నట్లు అంచనా వేశారు. డెల్టాతో పోలిస్తే తక్కువ తీవ్రత ఉన్నదని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ బాధితుల్లో కనిపిస్తోన్న లక్షణాలతోపాటు ఆస్పత్రిలో చేరుతున్న వారిని చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోందని బ్రిటన్‌ పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆస్పత్రుల్లో చేరుతున్న వారికి సంబంధించిన సమాచారం మాత్రం పరిమితంగా ఉందని గుర్తుచేశారు.

ఇంగ్లాండ్‌లో నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 11 మధ్యకాలంలో పీసీఆర్‌ టెస్టుల్లో కొవిడ్‌ నిర్ధారణ అయిన పాజిటివ్‌ కేసుల జాబితాను పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్‌ జీన్‌ (S Gene) టార్గెట్‌ ఫెయిల్యూర్‌ (SGTF)గా గుర్తించబడిన (లక్షా 96వేల కేసులు) వాటితో పాటు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిన (1846) కేసుల సమాచారాన్ని విశ్లేషించారు. వీటితోపాటు లక్షా 22వేల డెల్టా కేసులను కూడా పరిశోధకులు అధ్యయనం చేశారు. తద్వారా ప్రతి రెండురోజులకు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నట్లు అంచనా వేశారు. అధ్యయనం చేసే నాటికి అక్కడ కొవిడ్‌ రీప్రొడక్షన్‌ రేటు (ఆర్‌ ఫ్యాక్టర్‌) 3 ఉంది. అయితే, ప్రస్తుతం కొవిడ్‌ కేసుల సంఖ్య, ఆర్‌ ఫ్యాక్టర్‌ మరింత పెరగడం ఆందోళన కలిగించే విషయమని బ్రిటన్‌ ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొన్నారు.

రోగనిరోధకత శక్తిని తప్పించుకుంటూ..

ఇన్‌ఫెక్షన్‌ నుంచి, వ్యాక్సిన్‌ పొందడం వల్ల (రెండింటి నుంచి) పొందిన రోగనిరోధక శక్తి నుంచి ఏమేరకు ఈ వేరియంట్‌ తప్పించుకోగలదనే విషయాన్ని తెలుసుకునేందుకు తాజా అధ్యయనం తగినన్ని ఆధారాలు అందిస్తోందని ఇంపీరియల్‌ కాలేజీ ప్రొఫెసర్‌ నీల్‌ ఫెర్గూసన్‌ పేర్కొన్నారు. ఈ స్థాయిలో రోగనిరోధకశక్తి నుంచి తప్పించుకోవడం ప్రజారోగ్యానికి మరింత ముప్పు ఉందని అర్థమవుతోందన్నారు. ముఖ్యంగా డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వల్ల రీ ఇన్‌ఫెక్షన్‌ మూప్పు 5.4 రెట్లు అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలిందని నీల్‌ ఫెర్గూసన్‌ వెల్లడించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని