Modi US Visit: శాస్త్రి, మోదీ.. విమాన ప్రయాణాల్లోనూ బిజీగానే..

అమెరికా అధ్యక్షుడితో భేటీ, క్వాడ్ నేతలతో సమావేశం, యూఎన్‌లో ప్రసంగం.. ఇలా బిజీ షెడ్యూల్‌తో అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు ప్రధాని మోదీ. ఈ పర్యటనలో భాగంగా ........

Updated : 23 Sep 2021 22:06 IST

దిల్లీ: అమెరికా అధ్యక్షుడితో భేటీ, క్వాడ్ నేతలతో సమావేశం, యూఎన్‌లో ప్రసంగం.. ఇలా బిజీ షెడ్యూల్‌తో అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు ప్రధాని మోదీ. ఈ పర్యటనలో భాగంగా కీలక అంశాలపై చర్చలు జరపాల్సి ఉంది. ఈ క్రమంలో మోదీ ట్విటర్‌లో షేర్‌ చేసిన ఓ ఫొటో ఆయన పర్యటనలో ఎంత బిజీగా ఉన్నారో ప్రతిబింబిస్తోంది. బోయింగ్ విమానంలో అమెరికా వెళ్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనకు సంబంధించిన కాగితాలను అలా తిరగేస్తూ ఈ ఫొటోలో కనిపించారు. ‘సుదీర్ఘ ప్రయాణం అంటే మన పనికి సంబంధించిన కాగితాలను తిరగేసే అవకాశం కూడా’ అని మోదీ ట్విటర్‌లో రాసుకొచ్చారు. అయితే, ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారి ఎంతోమందిని మెప్పించింది. ‘నిరంతరం దేశ సేవలో’ అని అర్థం వచ్చేలా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని లాల్‌ బహదూర్ శాస్త్రికి సంబంధించి ఈ తరహా చిత్రాన్నే మరో భాజపా నేత కపిల్ మిశ్రా షేర్ చేశారు. 

అయితే, లా విమాన ప్రయాణాల్లో ఉండగా పనిలో నిమగ్నమైపోయిన ప్రధానుల్లో మోదీ ఒక్కరే కాదు.. భారత మాజీ ప్రధానులు లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, రాజీవ్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, పీవీ నరసింహారావు కూడా అంతే. వారు కూడా విమాన ప్రయాణాల్లోనూ ఉండగా పుస్తకాలు తిరగేయడమో, ఫైల్స్‌ను సరిచూసుకోవడమో వంటి కార్యక్రమాల్లో తీరికలేకుండా గడిపిన ఫొటోలను పలువురు ట్విటర్‌లో పంచుకున్నారు.

మరోవైపు, మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పలువురు ఎన్నారైలు భారత జాతీయ జెండాలతో మోదీకి స్వాగతం పలికారు. అలాగే ప్రధాని మోదీని స్వాగతించడం అమెరికా గౌరవంగా భావిస్తోందని ఆ దేశ చట్టసభలో సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, న్యాయపాలనలో ఇరు దేశాల మధ్య సంబంధాలు లోతుగా పాతుకుపోయాయన్నారు. పర్యటనలో తొలిరోజు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో మోదీ సమావేశం కానున్నారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని