Temple Elephant: ఆలయంలో విషాదం.. గుండెపోటుతో ఏనుగు మృతి

పుదుచ్చేరిలోని మనాకుల వినాయకర్‌ క్షేత్రానికి చెందిన ఓ ఏనుగు గుండెపోటుతో మృతి చెందింది. సాధారణ నడక కోసం బయటకు తీసుకెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు ఆలయ సిబ్బంది వెల్లడించారు.

Published : 30 Nov 2022 16:24 IST

పుదుచ్చేరి: ఆలయానికి చెందిన ఓ ఏనుగు గుండెపోటుతో మృతిచెందిన ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. ప్రముఖ మనాకుల వినాయక ఆలయానికి చెందిన ఓ ఏనుగు బుధవారం మృతి చెందింది. సాధారణ నడక కోసం బయటకు తీసుకెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు ఆలయ సిబ్బంది వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని ఏనుగు పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌  ఆలయానికి చేరుకొని నివాళులు అర్పించారు. ఆలయానికి ఎప్పుడు వచ్చినా.. ‘లక్ష్మీ’ ఆశీర్వాదాలు ఇచ్చేదంటూ మునుపటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

‘లక్ష్మీ’ అనే ఈ ఏనుగును 1995లో వినాయక ఆలయానికి ఓ వ్యాపారవేత్త విరాళంగా అందజేశారు. అప్పటి నుంచి అక్కడికి వచ్చే భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తూ ఎంతో ఆదరణ పొందింది. విదేశీయులు కూడా లక్ష్మీ ఆశీర్వాదాలు తీసుకుంటూ సంబరపడిపోయేవారు. ‘లక్ష్మీని బుధవారం ఉదయం సాధారణ నడక కోసం బయటకు తీసుకెళ్లగా.. ఓ పాఠశాల సమీపానికి చేరుకోగానే రోడ్డుపైన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంతవరకు ఎంతో ఆరోగ్యంగా ఉంది. అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్లే చనిపోయింది’ అని ఏనుగు సంరక్షణ చూస్తోన్న స్థానిక పశువైద్యుడు వెల్లడించారు. పుదుచ్చేరిలో కేవలం ఈ ఒక్క ఆలయానికి మాత్రమే ఏనుగు ఉంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని