‘సత్యేంద్ర జైన్‌కు 10 మందితో సపర్యలు.. అసలు ఏం జరుగుతోంది?’

 జైల్లో సత్యేంద్ర జైన్‌కు అందుతున్న సేవలకు సంబంధించి మరో వీడియో బయటకొచ్చింది. ఆయనకు దాదాపు 10 మంది సేవలు అందిస్తున్నారని భాజపా ఆరోపించింది.

Published : 27 Nov 2022 12:23 IST

దిల్లీ: తిహాడ్‌ జైలులో ఉన్న ఆప్‌ నేత, దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు సేవలు అందించేందుకు దాదాపు 8-10 మందిని కేటాయించినట్లు భాజపా అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా ఆరోపించారు. ఎనిమిది మంది ఆయన ఉన్న గదిని శుభ్రపరచడం సహా ఇతర అవసరాలు చూసుకుంటున్నారని జైలు వర్గాలను ఉటంకిస్తూ ఓ ప్రముఖ జాతీయ మీడియా సైతం పేర్కొంది. మరో ఇద్దరు ఈ ఎనిమిది మంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు రాసుకొచ్చింది. జైలులో జైన్‌కు అందుతున్న వీవీఐపీ సపర్యలపై దిల్లీ కోర్టు ఇటీవలే తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

మరోవైపు జైలులో తాను ప్రత్యేక ఆహారం తీసుకునేందుకు అనుమతించాలని కోరుతూ జైన్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. గుడికి వెళ్లడానికి, ప్రత్యేక ఆహారం తీసుకోవడానికి జైలులో తనకు అనుమతి ఇవ్వడం లేదని జైన్‌ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. తాను ప్రత్యేకంగా ఆధ్యాత్మిక ఆహారం తీసుకుంటున్నానని తెలిపారు. అందులో భాగంగా కేవలం పండ్లు, సలాడ్లు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పైగా గుడికి వెళ్లొచ్చిన తర్వాతే తాను ఆహారం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే.. కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది.

మరోవైపు సత్యేంద్ర జైన్‌ జైలు గదిని కొంతమంది శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీన్ని షెహజాద్‌ పూనావాలా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘అసలు ఏం జరుగుతోంది’’ అని ప్రశ్నించారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు