Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కలకలం

జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్ర ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఉగ్రవాదులు పంజా విసిరారు.

Published : 13 Jun 2024 03:57 IST

మూడు రోజుల్లో మూడు వరుస దాడులు
అమరుడైన సీఆర్పీఎఫ్‌ జవాన్, ఆరుగురికి గాయాలు
భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ముష్కరుల హతం

డోడా, కఠువా/దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్ర ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఉగ్రవాదులు పంజా విసిరారు. రియాసీ వద్ద ఆదివారం జరిగిన బస్సుపై దాడి ఘటన మరవకముందే.. మంగళవారం రాత్రి నుంచీ జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఓ సీఆర్పీఎఫ్‌ జవాను అమరుడు కాగా, ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు ఉగ్రవాదులు సైతం హతమయ్యారు. డోడా జిల్లాలోని భద్రవాహ్‌ - పఠాన్‌కోట్‌ రహదారిపై చటర్‌గాలా ఎగువభాగంలో ఉన్న ఉమ్మడి చెక్‌పోస్టుపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన అయిదుగురు సైనికులతోపాటు ఓ స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. కఠువా జిల్లా సైదా సుఖాల్‌ గ్రామంలో నక్కిన ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. తప్పించుకునే క్రమంలో ఓ ముష్కరుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ జవాను కబీర్‌దాస్‌ తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో హీరానగర్‌ సెక్టారులోని ఒక ఇంటిపైనా ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఇంటి యజమాని గాయపడ్డారు. ఈ ఇంటిపై కాల్పులు జరగడానికి ముందు ఉగ్రవాదులు పలు ఇళ్లకు వెళ్లి తాగేందుకు నీరు అడిగారు. తమ కదలికలపై గ్రామస్థులకు అనుమానం వచ్చిందని గ్రహించి ఆ ఇంటిపై వారు దాడి చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు పారామిలిటరీ బలగాలతో కలిసి సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరొకరి కోసం డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టగా.. 15 గంటల ఆపరేషన్‌ తర్వాత భద్రతాదళాలు బుధవారం మధ్యాహ్నం రెండో ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టాయి. ఈ ఆపరేషనులో ఇద్దరు సీనియర్‌ అధికారులు ఉన్న వాహనానికి బుల్లెట్లు తగిలినప్పటికీ వారు సురక్షితంగా బయటపడినట్లు భద్రతాదళాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని