Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆరుగురి అరెస్ట్!

ఇటీవల అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగిన నేపథ్యంలో భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్‌లో (Jammu Kashmir) అనుమానిత ఉగ్రవాదుల కదలికలపై దృష్టి సారించాయి. తాజాగా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 26 Sep 2023 17:04 IST

జమ్మూ : జమ్మూకశ్మీర్‌లో (Jammu Kashmir) ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు, ఓ మైనర్‌ ఉన్నట్లు బారాముల్లా జిల్లా పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో పలువురు ఉగ్రవాదులు పోలీసులు, భద్రతా సిబ్బందిపై దాడులకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆర్మీ కలిసి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురిని గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి మూడు తుపాకీలు, ఐదు హ్యాండ్‌ గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. 

అదృశ్యమైన ఆ విద్యార్థుల దారుణ హత్య.. మణిపుర్‌లో వెలుగులోకి మరో ఘోరం..!

‘మొత్తం ఆరుగురిని అరెస్టు చేశాం. వారిలో యాసిర్‌ అహ్మద్‌ షా ఉన్నాడు. ఇతడు యాక్టివ్‌ టెర్రరిస్ట్‌. మిగతా అయిదుగురు అతడికి సహాయం చేస్తున్నారు. అందులో ఒకరు మైనర్‌.’ అని బారాముల్లా సీనియర్‌ ఎస్పీ అమోక్‌ నాగ్‌పురే తెలిపారు. తాజా అరెస్టుల కారణంగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు జరగకుండా నిరోధించగలిగామని ఆయన చెప్పారు. సరిహద్దు నుంచి అక్రమ ఆయుధాల దిగుమతికి అడ్డుకట్ట వేశామన్నారు. యాసిర్‌ అహ్మద్‌ షా అరెస్టు తరువాతే అతడికి సాయ పడుతున్న వ్యక్తుల సమాచారం తెలిసిందని పేర్కొన్నారు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో మహిళలతో ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటే మహిళలు, మైనర్లు అనే తేడా చూడమని ఘాటుగా హెచ్చరించారు. 

కొద్ది రోజుల క్రితం అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ దాడుల్లో ముష్కర మూకలు నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. మృతుల్లో ముగ్గురు అధికారులు ఉండటం తీవ్ర ఆందోళనను కలిగించింది. ఈ ఘటన తరువాత జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు అనుమానిత ఉగ్రవాదుల కదలికలపై దృష్టి సారించాయి. పలు చోట్ల గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగిన నేపథ్యంలో అక్కడి భద్రతను సమీక్షించేందుకు సోమవారం ఓ కోర్‌ గ్రూప్‌ సమావేశమైంది. పోలీస్‌, ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే విషయంపై వారు చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు