Amitabh Bachchan: ఆ చీకటి రాత్రులు ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయ్‌..!

‘‘26/11 ఉగ్రదాడి జరిగి 13ఏళ్లు గడిచినా ఆ చీకటి రాత్రులు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆ దాడి.. భారత్‌కు ఎప్పటికీ ఓ బరువైన చరిత్రే’’ అంటూ 2008లో జరిగిన

Published : 26 Nov 2021 16:05 IST

ముంబయి పేలుళ్లను గుర్తుచేసుకున్న బిగ్‌బీ 

ముంబయి: ‘‘26/11 ఉగ్రదాడి జరిగి 13ఏళ్లు గడిచినా ఆ చీకటి రాత్రులు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆ దాడి.. భారత్‌కు ఎప్పటికీ ఓ బరువైన చరిత్రే’’ అంటూ 2008లో జరిగిన ముంబయి పేలుళ్లను గుర్తుచేసుకున్నారు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. ఈ దాడి జరిగి నేటికి 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన ఓపీనియన్‌లో బిగ్‌బీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

‘‘ముంబయిలో గతంలో ఎన్నోసార్లు ఉగ్రదాడులు జరిగాయి. కానీ, 2008 నవంబరు 26 వంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. 10 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి నగర వ్యాప్తంగా పేలుళ్లు, కాల్పులకు తెగబడ్డారు. వందల మందిని పొట్టన బెట్టుకున్నారు. మూడు రోజలు పాటు సాగిన ఆ చీకటి రాత్రులు ఇప్పటికీ మన మదిలో స్పష్టంగా గుర్తున్నాయి. ఉగ్రవాదుల లక్ష్య్ం కూడా ఇదే. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడం.. వారి దాడుల ప్లాన్‌లో భాగమే. కానీ, ఆ భయాన్ని మనం జయించాలి. ప్రజల మనుగడ శక్తి.. మానవత్వంతో ముడిపడి ఉంటుంది. ఆ భయం నుంచి విముక్తి పొందాలి. అప్పుడు మనం మరింత దృఢంగా జీవించగలుగుతాం. మన మార్గాన్ని ఉగ్రవాదులు మార్చేలా అవకాశం ఇవ్వకూడదు. మన అనుసంధానాన్ని నాశనం చేసే శక్తిని ఏ ఉగ్రవాద చర్యకూ ఇవ్వకూడదు’’ అని అమితాబ్‌ రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా ముంబయి దాడుల తర్వాత భారత ప్రభుత్వం అనుసరించిన తీరును బిగ్‌బీ ప్రశంసించారు. ‘‘26/11 ఘటన తర్వాత మన దేశం అత్యంత సహనం, సంయమనంతో వ్యవహరించింది. అజ్మల్‌ కసబ్‌ను పట్టుకోవడం, దాడి వెనుక పాక్‌ హస్తం ఉన్నట్లు తేలడంతో ఆ దేశంపై సైనిక ప్రతీకారం తీర్చుకోవాలని విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పటికీ ఆవేశానికి లోనుకాలేదు. న్యాయపరంగానే చర్యలు తీసుకుంది’’ అని పేర్కొన్నారు.  

ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మళ్లీ కరోనా మహమ్మారి రూపంలో విధ్వంసాన్ని చూస్తున్నామని అమితాబ్‌ అన్నారు. దీని కారణంగా ఎంతో మంది ప్రియమైన వారిని కోల్పోతున్నామని ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మనం గంభీరంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని