
Republic Day: ప్రధాని లక్ష్యంగా గణతంత్ర వేడుకలపై ఉగ్ర కుట్ర..!
డ్రోన్ల ద్వారా దాడులకు అవకాశమున్నట్లు సమాచారం..
దిల్లీ: ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని గణతంత్ర దినోత్సవం నాడు భారీ ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నాయని నిఘా సంస్థలకు సమాచారం అందినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పాకిస్థాన్, అఫ్గాన్-పాక్ ప్రాంతానికి చెందిన ముష్కరులు ఈ దాడులకు తెగబడే అవకాశాలున్నట్లు నిఘా సంస్థలకు వచ్చిన అలర్ట్‌లో ఉన్నట్లు సమాచారం.
గణతంత్ర వేడుకల్లో పాల్గొనే ప్రముఖులతో పాటు ప్రజా సమూహాలు, రద్దీ ప్రదేశాలను, కీలక కట్టడాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగొచ్చని తెలుస్తోంది. ముష్కరులు డ్రోన్లను ఉపయోగించి కూడా దాడులు చేసే అవకాశముందని నిఘా సంస్థలకు సమాచారం అందింది. లష్కరే తోయిబాతో పాటు ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలు దాడులకు కుట్రలు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. దిల్లీతో పాటు పంజాబ్, ఇతర నగరాల్లోనూ ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్థానీ ముఠాలు తమ బృందాలను పంజాబ్‌కు సమీపంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని సభపై ఈ ఉగ్రముఠా దాడులు చేసే అవకాశముందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దిల్లీ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ముమ్మర తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.
వేడుకలపై కరోనా ఎఫెక్ట్ కూడా..
మరోవైపు ఈ ఏడాది కూడా గణతంత్ర వేడుకలపై కరోనా ఎఫెక్ట్ కన్పిస్తోంది. దిల్లీ సహా దేశవ్యాప్తంగా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వేడుకలను నిరాడంబరంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈసారి గణతంత్ర వేడుకలకు పరేడ్‌కు కేవలం 4వేల మంది వీక్షకులను మాత్రమే అనుమతించే అవకాశాలున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వేడుకల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేయనున్నారు. పరేడ్‌కు వచ్చే వీక్షకులకు థర్మల్ స్క్రీనింగ్, మాస్క్‌లు, గ్లోవ్స్ వంటివి అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా ప్రభావంతో గతేడాది కూడా ఈ వేడుకలను నిరాడంబరంగానే నిర్వహించారు. కేవలం 25వేల మంది వీక్షకులను మాత్రమే అనుమతించారు.
ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు కజక్‌స్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాధినేతలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లు సమాచారం. ఇక గణతంత్ర ఉత్సవ శకటాలకు రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి ఈసారి మొత్తం 56 ప్రతిపాదనలు రాగా, అందులో 21 నమూనాలనే ఎంపిక చేశారు. విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు ఈ శకటాల ప్రదర్శన సాగుతుంది.