Updated : 24 Aug 2021 21:44 IST

Afghanistan Crisis: ప్రపంచం ముందు మరో ముప్పు..!

కాబుల్‌‌: తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్‌ ఓ కన్నీటి సంద్రమైంది. ప్రతి అఫ్గనీయుడి గుండె అంతులేని దుఃఖ సాగరంలా మారింది. తాలిబన్ల దురాక్రమణతో తమ భవిష్యత్తుని తలచుకొని అక్కడి పౌరులంతా ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బతుకు జీవుడా అంటూ.. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిన్న క్రమంలో చోటుచేసుకుంటున్న దృశ్యాలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిణామాలతో కేవలం అఫ్గానిస్థాన్‌లోనే కాకుండా యావత్‌  ప్రపంచం ముందు కొత్త ముప్పు పొంచి ఉంది. 20 ఏళ్లుగా నిర్వీర్యమైన ప్రమాదకర అల్‌ఖైదా ఉగ్ర సంస్థ తాలిబన్ల దన్నుతో మళ్లీ క్రియాశీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

ప్రపంచమంతా నిర్ఘాంతపోయిన రోజు..

2001 సెప్టెంబర్‌ 11.. అగ్రరాజ్యం అమెరికాలో అదో చీకటి రోజు. యావత్‌ ప్రపంచం అంతకమునుపెన్నడూ చూడని సరికొత్త తరహా ఉగ్రదాడి జరిగిన రోజు. ఒకరకంగా అమెరికాకే కాదు.. ప్రపంచం మొత్తానికి అది చీకటి రోజే. అమెరికా గుర్తింపునకు ప్రతీకగా చెప్పుకొనే డబ్ల్యూటీసీ జంట భవనాలను విమానాలతో ఢీకొట్టి వేలాది మంది ప్రాణాల హరించింది ఆ రోజే. ప్రపంచమంతా నిర్ఘాంతపోయిన ఆ ఘటనకు పాల్పడింది అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ.

ఆ దాడితోనే అల్‌ఖైదా వెలుగులోకి..
అమెరికాపై విద్వేషాన్ని చాటే అల్‌ఖైదాకు ప్రధాన కేంద్రం అఫ్గానిస్థాన్‌. అమెరికా లక్ష్యంగా అనేక ఉగ్రదాడులకు పాల్పడిన ఈ సంస్థ డబ్ల్యూటీసీ టవర్లపై దాడితోనే వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా అఫ్గానిస్థాన్‌లో అమెరికా సాగించిన ఉగ్రవాదంపై పోరు ప్రధానంగా అల్‌ఖైదా లక్ష్యంగానే జరిగింది. 2001 నుంచి 2021 వరకు సాగిన ఈ పోరాటంలో ఒకరకంగా అల్‌ఖైదా దాదాపు నిర్వీర్యమైపోయింది. దాని కార్యకలాపాలు సైతం ఎక్కువగాలేకుండా పోయాయి. అయితే, ఇప్పుడు అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ, తాలిబన్ల ఆక్రమణతో మళ్లీ అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ క్రియాశీలమయ్యే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వినబడుతున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్‌ హయాంలో అమెరికా ఉగ్రవాద నిరోధక విభాగం సీనియర్‌ డైరెక్టర్‌గా పనిచేసిన క్రిస్‌ కోస్టా స్వయంగా  అంగీకరించారు.

మళ్లీ క్రియాశీలత దిశగా పావులు!

డబ్ల్యూటీసీ టవర్లపై దాడికి ముందు అల్‌ఖైదా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది తాలిబన్లే. తాలిబన్‌ - అల్‌ఖైదా భావజాలం ఒక్కటే. ఇద్దరి ఉమ్మడి శత్రువు అమెరికాయే. అఫ్గాన్‌లో ఇప్పటికీ అల్‌ఖైదా సానుభూతిపరులు అనేకమంది ఉన్నారు.తాలిబన్ల దురాక్రమణతో  అల్‌ఖైదా మళ్లీ క్రియాశీలమయ్యే ప్రమాదం ఉందని అమెరికా పెంటగాన్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బే అంచనా వేశారు. అఫ్గాన్‌లో ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకొని తమ క్యాడర్‌ను బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రజల్లోకి భావజాలాన్ని విస్తరించడం, సానుభూతిపరులను తమవైపు తిప్పుకోవడం వంటి కార్యకలాపాలపై దృష్టిసారించే అవకాశం కనబడుతోందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన నివేదిక కూడా అల్‌ఖైదా సీనియర్‌ నాయకత్వం అఫ్గాన్‌లో ఇంకా క్రియాశీలకంగానే ఉందని చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోంది.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని