Nupur Sharma: నుపుర్‌ శర్మ హత్యకు కుట్ర? ఉగ్రవాది అరెస్టు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ ప్రతినిధి నుపుర్‌ శర్మను హతమార్చేందుకు కుట్ర పన్నిన ఓ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. అతన్ని సహరన్‌పుర్‌లోని కుండా కాలా గ్రామానికి చెందిన...

Published : 13 Aug 2022 00:02 IST

లఖ్‌నవూ: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మను హతమార్చేందుకు కుట్ర పన్నిన ఓ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. అతడిని సహ్రాన్‌పూర్‌లోని కుండా కాలా గ్రామానికి చెందిన మహమ్మద్‌ నదీమ్‌గా గుర్తించారు. పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ‘జైషే మహమ్మద్‌’కు చెందిన ముష్కరులు అతడికి ఈ పని అప్పజెప్పారని.. సహ్రాన్‌పూర్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. నుపుర్‌ని హత్య చేసేందుకు ఓ జైషే ఉగ్రవాది తనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు నిందితుడు కూడా అంగీకరించాడని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ కేసులో అతడు కొంతమంది సహచరుల పేర్లనూ వెల్లడించాడని.. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. 

జైషే మహమ్మద్‌, తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్‌ (టీటీపీ) సంస్థలు అతడితో నేరుగా కాంటాక్ట్‌లో ఉన్నాయని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీస్ ‘యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌’ తెలిపింది. జైషే, టీటీపీ భావజాలంతో ప్రభావితమైన నిందితుడు.. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసులపైనా దాడులకు సిద్ధమవుతున్నట్లు తమకు సమాచారం అందిందని చెప్పింది. ‘వర్చువల్ ఫోన్ నంబర్లను రూపొందించడంలో అతను శిక్షణ పొందాడు. సైఫుల్లా అనే పాకిస్థానీ.. దాడులపై అతనికి శిక్షణ ఇస్తున్నాడు. ప్రత్యేక శిక్షణ కోసం పాక్‌ వెళ్లేందుకూ సిద్ధమయ్యాడు.. అతని ఫోన్‌ రికార్డులు, మెసేజ్‌లతో ఈ విషయం తేటతెల్లం అవుతోంది’’ అని పోలీసులు తెలిపారు.

పేలుడు పదార్థాలను ఎలా తయారు చేయాలో నేర్పించే పలు డాక్యుమెంట్లను కూడా అతడి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అతడి ఫోన్‌లో ఉగ్రవాదులతో చేసిన చాటింగ్‌, వాయిస్ రికార్డులను గుర్తించామన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అతను ఉగ్రవాద సంస్థలతో టచ్‌లో ఉన్నాడని తెలిపారు. ఇదిలా ఉండగా.. మహమ్మద్‌ ప్రవక్త గురించి నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు భారత్‌తోపాటు ఇస్లామిక్‌ దేశాల్లో భారీ ఎత్తున నిరసనలకు దారితీశాయి. దీంతో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆమెను భాజపా సస్పెండ్ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని