ఉద్ధవ్‌ ఠాక్రేకు చుక్కెదురు.. 66మంది కార్పొరేటర్లు శిందే క్యాంపులోకి జంప్‌

శివసేన (Shiv Sena) రెబల్‌ నేతల తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు (Uddhav Thackeray) మరోసారి చుక్కెదురయ్యింది.

Published : 07 Jul 2022 15:32 IST

ముంబయి: శివసేన (Shiv Sena) రెబల్‌ నేతల కారణంగా అధికారం కోల్పోయిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు (Uddhav Thackeray) మరోసారి చుక్కెదురయ్యింది. ఠాణె మున్సిపల్‌ కార్పొరేషన్‌కు (TMC)కి చెందిన 66మంది శివసేన కార్పొరేటర్లు శిందే గూటికి చేరిపోయారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde)ను బుధవారం రాత్రి కలిసిన శివసేన రెబల్‌ కార్పొరేటర్లు.. ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించినట్లు సీఎం సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దీంతో ఉద్ధవ్‌ వర్గంలో కేవలం ఒక్క కార్పొరేటర్‌ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. బీఎంసీ (బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌) తర్వాత అతి కీలకమైన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఠాణెనే కావడంతో ఉద్ధవ్‌ పార్టీ అక్కడ పట్టు కోల్పోతున్నట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.

ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్‌ శిందే వర్గం.. భాజపా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు శిందేకు తోడుగా నిలవడంతో ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఆయనకు తేలికయ్యింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ తమదే అసలైన శివసేన అంటూ ఇరువర్గాలు పేర్కొనడం గమనార్హం. పార్టీ గుర్తు తమదేనంటూ ప్రకటించుకుంటున్నాయి. మరోవైపు పార్టీకి ప్రస్తుతం లోక్‌సభలో 18 మంది ఉండగా.. అందులో 12 మంది తమవైపే ఉన్నట్లు శివసేన రెబల్‌ ఎమ్మెల్యే గులాబ్‌రావ్‌ పాటిల్‌ చెబుతున్నారు. ఇలా మున్సిపల్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ తాజా పరిణామాలు ఉద్ధవ్‌ ఠాక్రేకు మరింత సవాలుగా మారినట్లు కనిపిస్తున్నాయి.

ఇదిలాఉంటే 2017లో శివసేన తరపున ఠాణె మున్సిపల్‌ కార్పొరేటర్లుగా ఎన్నికైన వీరి పదవీకాలం ఇప్పటికే ముగిసింది. అయితే, టీఎంసీ ఎన్నికలు ఈ ఏడాది మొదట్లోనే జరగాల్సి ఉన్నప్పటికీ స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. ఈ సమయంలోనే ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని