Ketaki Chitale: పవార్‌పై అనుచిత పోస్ట్‌.. ఆ నటి మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ స్వాధీనం!

ఎన్‌సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలను షేర్‌ చేసినందుకు......

Published : 16 May 2022 18:49 IST

ముంబయి: ఎన్‌సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలను షేర్‌ చేసినందుకు మరాఠీ నటి కేతకి చితాలేను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో దర్యాప్తునకు ఎలక్ట్రానిక్‌ ఆధారాలను సేకరించడంలో భాగంగా పోలీసులు ఆమెను నవీ ముంబయిలోని కలంబోలీలో తన నివాసానికి తీసుకెళ్లారు. ఠానే క్రైం బ్రాంచ్‌ పోలీసులతో పాటు, కలంబోలి పోలీసు బృందాలు నటి ఇంటికి వెళ్లి దాదాపు గంట పాటు అక్కడే ఉన్నారు. అనంతరం ఆమె ఫోన్‌, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టును నటి కేతకి చితాలే శుక్రవారం షేర్‌ చేశారు. 'మీకోసం నరకం వేచిచూస్తోంది', 'బ్రాహ్మణులను మీరు అసహ్యించుకుంటారు' అంటూ పోస్టులో పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పోస్టులో శరద్‌ పవార్‌ పేరును పూర్తిగా ప్రస్తావించకుండా .. ‘‘80 ఏళ్ల పవార్‌’’ అని మాత్రమే పేర్కొన్నారు. అయితే, శరద్‌ పవార్‌ వయస్సు ప్రస్తుతం 81 ఏళ్లు. అయితే, చితాలేపై ఠానేలోని కల్వా పోలీస్‌ స్టేషన్‌లో స్వప్నిల్‌ నెత్కే అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 18వరకు ఆమె పోలీస్‌ కస్టడీలో ఉండనున్నారు. మరోవైపు, మహారాష్ట్రలోని ఐదు జిల్లాల్లో కేతకిపై ఆరు కేసులు నమోదయ్యాయి.

ఈ ఘటనపై శరద్‌ పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. కేతకి పోస్ట్‌ చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగపరుస్తున్నారన్నారు. అసలు కేతకి ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారు. ఇది సంస్కృతికి సంబంధించిన సమస్య అన్న సుప్రియా.. తాను మధ్యతరగతి మరాఠీ విలువల మధ్య పెరిగానన్నారు. ఎవరినైనా దూషించడం తన సంస్కృతి కాదని చెప్పారు. ఒకరి తండ్రి లేదా మరో వ్యక్తి మరణాన్ని కోరుకోవడం ఏం సంస్కృతి అని సుప్రియా సూలే ప్రశ్నించారు. ఇలాంటివి చాలా దురదృష్టకరమని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని