Punjab Results: థాంక్యూ సర్‌.. ప్రధాని మోదీకి కేజ్రీవాల్‌ ధన్యవాదాలు..!

పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ విజయంపై ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు స్పందించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘థాంక్యూ సర్‌’ అంటూ బదులిచ్చారు.

Published : 11 Mar 2022 19:32 IST

కాంగ్రెస్‌ ఎప్పటికీ పాఠాలు నేర్చుకోలేదన్న కెప్టెన్‌ అమరీందర్‌

దిల్లీ: పంజాబ్‌ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమ్‌ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని ట్వీట్‌కు అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా స్పందించారు. ‘పంజాబ్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్‌ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు. పంజాబ్‌ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తరపున అన్నివిధాలా తోడ్పాటు అందిస్తాం’ అంటూ ఆమ్ఆద్మీ పార్టీ విజయం పట్ల శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. తాజాగా దీనికి స్పందించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘థాంక్యూ సర్‌’ అంటూ ట్విటర్‌లో బదులిచ్చారు.

కాంగ్రెస్‌ ఎప్పటికీ నేర్చుకోలేదు..

పంజాబ్‌లో అమరీందర్‌ సింగ్‌పై వ్యతిరేకతే కాంగ్రెస్‌ పార్టీ దారుణ ఓటమికి కారణమంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి పేర్కొనడం పట్ల మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్ సింగ్‌ స్పందించారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం ఇంకెప్పుడూ పాఠాలు నేర్చుకోలేదు. యూపీలో అత్యంత అవమానకర ఓటమికి ఎవరు కారణం? మణిపూర్‌, గోవా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓటమికి ఎవరు కారణం..? వీటికి సమాధానం ఎప్పుడూ గోడపై ‘పెద్ద అక్షరాల’తో రాసి ఉంటుంది. అయినప్పటికీ కాంగ్రెస్‌ నేతలు ఎప్పటిమాదిరిగానే దానిని చదవకుండా ఉంటారని భావిస్తున్నా’ అంటూ కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించారు.

ఇదిలాఉంటే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆప్‌ పంజాబ్‌లో 92 సీట్లతో గెలుపొంది రికార్డు సృష్టించింది. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌సింగ్ బాదల్‌, అమరీందర్‌ సింగ్‌ వంటి దిగ్గజ నేతలను కూడా ఆమ్‌ఆద్మీ ఓడించింది. గత ఎన్నికల్లో మొత్తంగా 23.7శాతం ఓట్లను సొంతం చేసుకున్న ఆప్‌, ఈసారి ఆ బలాన్ని 42శాతానికి పెంచుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు