Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!

తిరువనంతపురం పేరును కొందరు విదేశీయులు సరిగ్గా పలకలేకపోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ విచారం వ్యక్తం చేశారు.

Published : 04 Oct 2023 01:54 IST

తిరువనంతపురం: తన నియోజకవర్గం పేరును విదేశీయులు సరిగ్గా పలకలేకపోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ విచారం వ్యక్తం చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురం (Thiruvananthapuram) పేరు బదులు ‘అనంతపురి’ అని పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇటీవల దక్షిణాఫ్రికా క్రికెట్‌ ఆటగాళ్లు తిరువనంతపురం పేరును సరిగ్గా పలకలేకపోయిన ఓ వీడియో వైరల్‌గా మారిన నేపథ్యంలో శశిథరూర్‌ ఎక్స్‌ (ట్విటర్‌లో) ఈ విధంగా స్పందించారు.

ఐసీసీ వరల్డ్‌ కప్‌ (ICC World Cup) మొదలవుతోన్న క్రమంలో సన్నాహక మ్యాచ్‌ కోసం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఇటీవల తిరువనంతపురానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు తిరువనంతపురాన్ని వివిధ రకాలుగా పలుకుతున్న వీడియో వైరల్‌గా మారింది. దీన్ని షేర్‌ చేసిన శశిథరూర్‌.. ‘వాళ్లు ఎక్కడున్నారో ఎవరికైనా చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. ఇంతకంటే ఉత్తమంగా చెప్పలేరన్న ఆయన.. కేవలం క్రికెటర్లే కాకుండా నటీనటులు కూడా ఈ నగరం పేరును సరిగ్గా పలకలేకపోవడాన్ని గుర్తుచేశారు.

నేరస్థులుగా వచ్చి.. గ్రాడ్యుయేట్లుగా బయటికి

ఏటా నిర్వహించే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ కేరళ (IFFK)లోనూ ప్రముఖ నటులు ఈ పేరు పలకడంలో ఇబ్బందిపడిన విషయాన్ని తాను విన్నానని శశిథరూర్‌ పేర్కొన్నారు. కొందరు మాత్రమే తిరువనంతపురం పేరును సరిగ్గా పలికారని చెప్పారు. అందుకే ‘అనంతపురి’ పేరును ఎంచుకుంటే బాగుండేదని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే చరిత్రకారుల ప్రకారం.. పూర్వం దీనిని తిరుఆనందపురం, శ్యానందపురం, సనందపురం అని పిలిచేవారట. అనంతరం విదేశీయుల పాలనలో దీన్ని త్రివేండ్రంగా పిలిచారు. అనంతపద్మనాభ స్వామి పేరు మీదుగా ఈ నగరానికి ‘తిరు-అనంత-పురం’ పేరు వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని